తమిళసినిమా: నటుడు శశి కుమార్, సిమ్రాన్ జంటగా నటించిన తాజా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. యోగిబాబు, మిథున్, జయశంకర్, కమలేష్, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, బక్స్ భగవతి పెరుమాళ్, సీజ రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా అభిశక్ జీవిన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎం ఆర్ పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల అధినేతలు నజరేద్ ప్రియాన్, మహేష్ రాజ్ పస్లియాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. అరవింద్ విశ్వనాథన్ చాయాగ్రహణం, షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే ఒకటవ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నిర్మాతల్లో ఒకరైన మహేష్ రాజ్ పస్లియాన్ మాట్లాడుతూ తాము ఇంతకుముందు నిర్మించిన గుడ్ నైట్, లవర్ వంటి రెండు హిట్ చిత్రాల తర్వాత నిర్మించిన మూడో చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ అని, ఇది కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దర్శకుడు అభిశన్ జీవిన్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే దర్శకత్వం వహించడమే తన లక్ష్యంగా భావించానన్నారు. అలా ఎవరి వద్ద సహాయ దర్శకుడుగా పని చేయకుండానే కథను సిద్ధం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు శశి కుమార్ మాట్లాడుతూ ఇది శ్రీలంక తమిళ కుటుంబానికి సంబంధించిన కథా చిత్రం అని చెప్పారు. ఆ కుటుంబం చైన్నెకి వచ్చి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది అన్నది వినోదభరితంగా చూపించినట్లు చెప్పారు.