
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకుడు రవిచంద్రన్ భార్య జయచిత్ర(40). ఈమె శుక్రవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలోని పెద్దకుప్పం వద్ద ఉన్న బంధువుల శుభ కార్యానికి హాజరై ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. పోలీవాక్కం వద్ద వెళ్తున్న సమయంలో ముందు ఉన్న లారీని దాటుకుని వెళ్లడానికి యత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న జయచిత్ర లారీ కింద చిక్కుకపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మనాలనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో సంఘటనలో తిరువళ్లూరు జిల్లా సూలైమేణి గ్రామానికి చెందిన కార్తీక్(30) ఊత్తుకోట సమీపంలోని సిప్‌కాట్‌లోని ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. శనివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో పాలవాక్కం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కార్తీక్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టి, సమీపంలోని ఇంటిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లోని వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ రెండు సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.