
ఇసుక మాఫియాతో బేరం
– ఆడియో వైరల్‌తో వీఆర్‌కు డీఎస్పీ
సాక్షి, చైన్నె: ఇసుక మాఫియాతో ఓ డీఎస్పీ బేరం ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఆడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఆ డీఎస్పీని విధుల నుంచి తప్పించి వీఆర్‌కు పంపించారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూరుపేట డీఎస్పీగా ప్రదీప్ పనిచేస్తున్నారు. ఆయన ఇసుక అక్రమ రవాణాకు సహకరించే విధంగా మాఫియా ముఠాతో జరిపిన ఆడియో సంభాషణలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఆడియో డీఎస్పీదే అన్నది నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ వీఆర్‌కు పంపించారు. అలాగే, ఈ వ్యవహారంపై ఐజీ విచారణకు డీజీపీ శంకర్‌జివాల్ ఆదేశించారు.
గ్రూప్–4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
●దరఖాస్తుల స్వీకరణ
●ఓఎంఆర్ సీట్‌లో మార్పులు
సాక్షి, చైన్నె: తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. ఓఎంఆర్ సీట్‌లో మార్పులు చేశారు. దరఖాస్తులను మే 24వ తేదీ వరకు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ వంటి 3,935 పోస్టులను భర్తీ చేయడానికి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. టీఎన్‌పీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మే 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 12న రాత పరీక్ష జరగనుంది. ఈసారి ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఓఎంఆర్ సీట్‌లను మార్పు చేశారు. మార్పు వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఓఎంఆర్ షీట్ శాంపిల్ పేరిట దీనిని దరఖాస్తులు చేసుకునే చోటే ఉంచారు. దీని ఆధారంగా ఈ సారి అభ్యర్థులు పరీక్షల్లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు.
ఎస్‌వీ.శేఖర్ క్షమాపణకు గడువు
తమిళసినిమా: మహిళా పాత్రికేయురాలిని క్షమాపణ కోరడానికి నటుడు, మాజీ ఎంపీ ఎస్‌వీ.శేఖర్‌కు సుప్రీంకోర్టు జూలై నెల వరకూ అవకాశాన్ని ఇచ్చింది. వివరాలు చూస్తే 2018లో మహిళా పాత్రికేయురాలిని కించపరచే విధంగా మాట్లాడినందుకుగాను ఆమె చైన్నె ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఎస్‌వీ.శేఖర్‌కు నెల జైలు శిక్ష, రూ.15 జరిమానా విధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌వీ.శేఖర్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు కూడా చైన్నె ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఎస్‌వీ.శేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో తాను అవమానించినట్లుగా భావించిన మహిళా పాత్రికేయురాలిని క్షమాపణ కోరడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా ఈయన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు మహిళా పాత్రికేయురాలిని కలిసి క్షమాపణ కోరడానికి ఎస్‌వీ.శేఖర్‌కు జూలై నెల వరకూ కాలావకాశాన్నినిస్తూ ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా ఈ విషయంలో ఆ పాత్రికేయురాలి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
విహారయాత్రలో విషాదం
●ఇద్దరు తమిళనాడు వైద్య విద్యార్థినుల మృతి
●ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం
యశ్వంతపుర(కర్ణాటక): విహారయాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మెడిసిన్ విద్యార్థినులు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద మెడికల్ విద్యార్థులు కాంజిమోళి, సింధుజా మృతిచెందారు. విద్యార్థులను రక్షించడానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. సముద్రంలో మునుగుతుండగా అలలు రావడంతో చిక్కుకున్న వారిని రక్షించడానికి సాధ్యం కాలేదు. మృతులు తమిళనాడులోని తిరుచ్చి మెడికల్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. అనంతరం తీర రక్షణ దళం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. గోకర్ణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు.

ఇసుక మాఫియాతో బేరం