
బయల్పడిన వృద్ధురాలి మృతదేహం
తిరువొత్తియూరు: వలసరవాక్కం సౌందర్య నగర్ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న విజయభాను(75), ఈమె కుమార్తె కుటుంబంతో సహా అమెరికాలో ఉంటున్నారు. వృద్ధురాలు విజయభాను ఒంటరిగా ఉంటున్న క్రమంలో గత 4 రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానించింన ఇరుగుపొరుగు వారు వలసరవాకం పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ అన్బుకరసన్, పోలీసులు అక్కడి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ విజయభాను మృతి చెంది ఉన్నట్టు తెలిసింది. ఆమె ఎలా మృతి చెందిందనేదానిపై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. వృద్ధురాలి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైభవంగా తెప్పోత్సవం
కొరుక్కుపేట: శ్రీవాసవీ వసంతోత్సవంలో భాగంగా మూడు రోజులపాటు ఏర్పాటు చేసిన తెప్పోత్సవం అత్యంత వైభవంగా గురువారం రాత్రి ఆరంభమైంది. చైన్నె జార్జి టౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీవాసవీ వసంతోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతీ రోజు ఘనంగా సాగుతున్నాయి. ఆలయం మహా మండపంలో ప్రత్యేకంగా కృత్రిమ కోనేరును ఏర్పాటు చేశారు. అందులో ఈ నెల 26వ తేదీ వరకు శ్రీవాసవి అమ్మవారి తెప్పపై ఊరేగింపు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన తెప్పోత్సవంలో ఆలయ ట్రస్టీలు పాల్గొని, తెప్పను లాగుతూ అమ్మవారి సేవలో తరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఐఐటీ మద్రాసు
మరో అరుదైన ఘనత
– ఒక్క ఏడాదిలోనే 417 పేటెంట్లు దాఖలు
కొరుక్కుపేట: ఐఐటీ–మద్రాసు మరో అరుదైన మైలురాయిని సాదించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు కలసి మొత్తం 417 పేటెంట్లను దాఖలు చేశారు. ఇది డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ‘వన్ పేటెంట్ వన్ డే’ దార్శనికతను అధిగమించింది. ఇందులో 298 భారతీయ పేటెంట్లు కాగా 119 అంతర్జాతీయ పేటెంట్లు ఉన్నాయి. అదనంగా, ఇన్‌స్టిట్యూట్ 39 డిజైన్లు, 6 కాపీరైట్లు, 1 ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది, దీనితో 2024– 25 సంవత్సరానికి మొత్తం ఐపీ ఫైలింగ్‌ల సంఖ్య 463కి చేరుకుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తెలిపారు. ఇంకా, గత ఐదేళ్లలో ఐఐటీ మద్రాస్ వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసిందని, రూ. 28 కోట్ల విలువైన లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, ఎంఎన్‌సీల వంటి పరిశ్రమ భాగస్వాములకు బదిలీ అయ్యాయన్నారు. వీటి లో అతిపెద్దది తేజస్ నెట్‌వర్క్ (టాటా గ్రూప్)కి బదిలీ చేసిన 5జీ ఆర్‌ఏఎన్ సబ్–సిస్టమ్ టెక్నాలజీ అని తెలిపారు. ఏటా ఏప్రిల్ 26న జరుపుకునే ‘ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం’ సందర్భంగా ఈ వేడుకలు జరుపుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు శుభాభినందనలు తెలియజేశారు.