
రైలులో రేషన్ బియ్యం పట్టివేత
వేలూరు: యశ్వంత్‌పూర్ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రకు రైలులో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రైల్యే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలూరు జిల్లా నుంచి ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తమిళనాడు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకెళ్లి వాటికి పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు సివిల్ సప్లయిస్ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులు సైతం తరచూ వాహన తనిఖీలు చేస్తున్నారు. దీంతో రేషన్ బియ్యాన్ని రైలు మార్గంలో అధికంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే పోలీసులు కాట్పాడిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా యశ్వంత్‌పూర్ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రకు జనరల్ కంపార్ట్‌మెంట్ బోగిలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేయగా రైలు సీట్లు కింద సుమారు 15 గోనె సంచుల్లో మొత్తం 450 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు కూలీల సాయంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస అధికారులకు అప్పగించారు.