
ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ
సేలం : చైన్నెలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విద్యార్థికి రోబోటిక్ సర్జరీ చేసిన వైద్యులను మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న అశ్విని (16) అనే విద్యార్థిని చైన్నెలోని ఓమందూర్ గవర్నమెంట్ ఎస్టేట్‌లోని తమిళనాడు ప్రభుత్వ మల్టీ–స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈనెల 3వ తేదీ గుండెకు రోబోటిక్ సర్జరీ చేయించుకుని కోలుకుంది. రాష్ట్ర ఆరోగ్య, ప్రజా సంక్షేమ మంత్రి ఎం.సుబ్రమణియన్ శనివారం నేరుగా అశ్వినిని కలిసి ఆమెను పరీక్షించి చికిత్స చేసిన వైద్య బృందాన్ని ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి రోబోటిక్ సహాయంతో గుండె బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. చైన్నెలోని మేడవాక్కంకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని అశ్విని ప్రస్తుతం అలందూర్‌లో నివసిస్తోందన్నారు. వైద్యులు రోబోటిక్ సహాయంతో ఆమె గుండెలోని రంధ్రం సరిచేసి పూడ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స చేసినట్టు తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్సకు నెలల తరబడి ఆస్పత్రుల్లో ఉండడం, లక్షల్లో ఖర్చులు అవుతాయన్నారు. అదేవిధంగా రోగి శరీరంపై పెద్ద మచ్చలు ఏర్పడుతాయన్నారు. అయితే ఈ రోబోటిక్ శస్త్ర చికిత్స ద్వారా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పని లేదని, అదే విధంగా శరీరంపై ఎలాంటి మచ్చలు పెద్దగా ఏర్పడవని తెలిపారు. ఈ చికిత్సకు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి రావడంతో అతి తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సను పూర్తి చేసినట్టు తెలిపారు. దేశంలోనే రాష్ట్ర ప్రజా సంక్షేమశాఖ పలు స్థాయిలలో రికార్డులు సృష్టిస్తోందన్నారు. గత రెండు రోజుల క్రితం కూడా జాతీయ వృద్ధుల సంక్షేమ ఆస్పత్రిలో వారికి అందించే ప్రత్యేక చికిత్స గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 41 మంది వైద్యులు ఇక్కడ మూడు రోజులు శిక్షణకు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు.