
ప్రభుత్వ పథకాలపై హర్షం
వేలూరు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన చట్టంలోని తొమ్మిది పథకాలను ఆహ్వానిస్తున్నట్లు జాక్టో జియో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనన్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాక్టో జియో ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పది డిమాండ్‌లను పరిష్కరించాలని పలు పోరాటాలు చేయడంతో తమ వినతిని ప్రభుత్వం స్వీకరించి అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఇచ్చిన హామీలు లేనివి కూడా ప్రస్తుతం ప్రకటించడం సంతోషకరమన్నారు. పండుగ రోజుల ముందస్తు నగదు రూ.10 వేలు నుంచి 20 వేలకు పెంచడం, మహిళల ప్రసవ సెలవు దినాలు పెంచడం, ఉన్నత విద్యను అభ్యసించడానికి రూ.1 లక్ష పెంచడం వంటి పథకాలను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాక్టో జియో, ఒకేషనల్ టీచర్లు ఇందుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు తమిళనాడు పట్టభద్రుల టీచర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జయకుమార్, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, తమిళనాడు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీడీ బాబు, గుణశేఖరన్ తదితరులున్నారు.