
సీమాన్ చిత్రానికి రజనీ టైటిల్
తమిళసినిమా: నామ్ తమిళర్ పార్టీ నేత సెంతమిళన్ సీమాన్ ప్రధానపాత్రను పోషిస్తున్న చిత్రానికి ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ధర్మయుద్ధం టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు తప్పాట్టం, యాంటీ ఇండియన్, ఉయిర్ తమిళుక్కు వంటి చిత్రాలను నిర్మించిన దర్శక నిర్మాత, మూన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆదం బాల తాజాగా ప్లానెట్–9 పిక్చర్స్ అధినేత డాక్టర్ ఆర్కే శివకుమార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ధర్మయుద్ధం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో సెంతమిళన్ సీమాన్‌తో కలిసి ఆర్కే సురేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మలయాళం నటి అను సితార నాయకిగా నటిస్తున్న ఇందులో ఇళవరసు, ఎంఎస్ భాస్కర్, వెట్రి కుమరన్, సాట్టై దురై మురుగన్, జయకుమార్, ఆదిరా పాండియలక్ష్మి, సౌందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.సుబ్రహ్మణ్యం కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని, చెళియన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఒక హత్య నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. తెన్‌కాశి, కుట్రాలం, దిండుగల్ పరిసర ప్రాంతాల్లోని నగర గ్రామీణ ప్రదేశాల్లో షూటింగు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ధర్మయుద్ధం చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
సీమాన్, అను సితార

సీమాన్ చిత్రానికి రజనీ టైటిల్