
పహల్గాం మృతులకు అశ్రు నివాళి
వేలూరు: కశ్మీర్‌లో భారతీయులను అత్యంత క్రూరంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని వేలూరు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధ్వజమెత్తారు. ముందుగా వేలూరు జిల్లా కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్‌లో మాజీ సైనికులు నల్ల దుస్తులు ధరించి మృతి చెందిన 26 మంది చిత్ర పటాలను ఉంచి వారి ఆత్మ శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ కశ్మీర్‌లో ప్రకృతిని ఆస్వాధించడానికి వెళ్లిన భారతీయులను కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఐక్యత, దేశ సమగ్రతను బలహీన పరచలేరని అన్నారు. ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షపడే విధంగా చూడాలన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సైతం దీటుగా వ్యవహరించాలన్నారు. ముందుగా మాజీ సైనికులు నల్ల దుస్తులతో కొవ్వొత్తులను చేత బట్టి ఊరేగింపుగా వచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.