గ్రూప్‌ 4లో పరీక్షల స్థాయి మధ్యస్తం.. పలువురు అభ్యర్థుల పరేషాన్‌! | 80 percent attendance for Group4 | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ 4లో పరీక్షల స్థాయి మధ్యస్తం.. పలువురు అభ్యర్థుల పరేషాన్‌!

Published Sun, Jul 2 2023 3:33 AM | Last Updated on Sun, Jul 2 2023 3:40 PM

80 percent attendance for Group4   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి శనివారం నిర్వహించిన గ్రూప్‌–4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. రెండు పరీక్షలకు మొత్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 9,12,380 మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్‌–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్‌–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలవారీగా ఓఎంఆర్‌ షీట్ల లెక్కింపు తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని తెలిపింది.

పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌), పేపర్‌–2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) పరీక్షల్లో ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్‌–1లో ఎక్కువగా సూటిప్రశ్నలు, అప్లికేషన్‌ తరహా ప్రశ్నలు వచ్చాయని, పేపర్‌–2లో గణితం నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.

గ్రాఫ్స్, చార్టులతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టిందన్నారు. చాలా వరకు నంబరింగ్‌ సిస్టంలో ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు కాస్త తికమకపడ్డట్లు తెలిసింది. చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న బలగం చిత్రం నుంచి కూడా ఈ పరీక్షలో ఓ ప్రశ్న రావడం గమనార్హం. 

సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ సెంటర్‌లో శనివారం ఉదయం అభ్యర్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రం బండిల్‌ సీల్‌ లేకుండా ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సీలు ముందే తీసి పేపర్‌ లీక్‌ చేశారా అని ప్రశ్నించారు. ఓఎంఆర్‌ షీట్స్‌ బండిల్‌ అనుకొని పొరపాటున సీల్‌ తీశామని ఇన్విజిలేటర్లు, పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. 

 హైదరాబాద్‌లోని మారుతీనగర్‌లో ఉన్న ఓ కేంద్రంలో కె.రాజేష్‌ (36) అనే అభ్యర్థి పేపర్‌–1 పరీక్షను సెల్‌ఫోన్లో చూసి రాస్తూ పట్టుబడ్డాడు. కలెక్టర్‌ ఆదేశంతో అతనిపై మాల్‌ప్రాక్టీస్‌ కింద కేసు నమోదైంది. 

 మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన వల్లందాస్‌ మురళి అనే  అభ్యర్థి కాస్త ఆలస్యంగా పేపర్‌–2 పరీక్ష  రాసేందుకు రాగా అప్పటికే గేటుకు తాళం వేశారు. దీంతో గోడదూకి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. 

 వరంగల్‌ జిల్లా కొనాయమాకుల వద్ద గల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ మహిళ 3 నెలల పాపతో వచ్చింది. అక్కడే డ్యూటీ చేస్తున్న గీసుకొండ ఎస్సై ఎ. శ్వేత ఆ బిడ్డను పరీక్ష సమయం ముగిసే వరకు అక్కున చేర్చుకుంది. 

 ఖమ్మం దరిపల్లి ఆనంతరాములు ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో ఉదయం పరీక్ష రాసిన వారిలో నలుగురు అభ్యరులు ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వకుండానే బయటకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని షీట్లు తీసుకున్నారు. అలాగే వారు మధ్యాహ్నం పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. 

జగిత్యాల జిల్లాలోని గ్రూప్‌–4 పరీక్ష కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులు తమ ఆభరణాలు తొలగించడానికి ఇబ్బంది పడ్డారు. 

 జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో పేపర్‌–1 పరీక్ష రాసేందుకు వచ్చి కిటికీ పక్కన కూర్చున్న ఓ అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ గాలి కి కొట్టుకుపోయింది. దాన్ని తెచ్చుకొనేందుకు పోలీసులు అతన్ని అనుమతించకపోగా అక్కడి సిబ్బంది చివరకు షీట్‌ను తీసుకొచ్చారు. 

 జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ప్రాథమిక చికిత్స అందించారు. 

 ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ఒరిజినల్‌ ఐడీ కార్డులు తీసుకురాని దాదాపు 100 మంది అభ్యర్థులను పరీక్షకు నిరాకరించారు. 

విద్యుత్‌ వైరు తెగిపోవడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద సికింద్రాబాద్‌ నుంచి మణుగూరు వెళ్తున్న రైలు సమీపాన నిలిచిపోయింది. దీంతో గ్రూప్‌–4 పరీక్ష రాసేందుకు రైల్లో వస్తున్న వందలాది మంది అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తూ ప్రైవేటు వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు బయలుదేరారు. 

 వనపర్తి జిల్లాలోని 46 పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను తీసుకెళ్లేందుకు రాత్రి 11:15 గంటలు దాటినా టీఎస్‌పీఎస్సీ అధికారులు ఎవరూ రాలేదు. దీనిపై పరీక్షల నిర్వాహణ అధికారి రమేష్రెడ్డి మాట్లాడుతూ గద్వాల, వనపర్తి జిల్లాలకు ఒక్కరే అధికారి ఉండటంతో ఆలస్యమైనట్లు చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement