
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్స్) నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తున్న వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారీగా వ్యతిరేక ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) చేపట్టాలని, నిరసనలతో కేసీఆర్ సర్కార్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని (రివర్స్ గేర్) నిర్ణయించింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయా విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రతీరోజు ఆయా రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రజల ఇబ్బందులను ఎండగట్టేలా వివిధ రూపాల్లో, వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. శనివారం ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏవిధంగా దెబ్బతిందో, రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఎలా విఫలమైందో ప్రజలకు వివరించనున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ భాగస్వాములను చేయనున్నారు.
ఏ రోజు ఏ అంశంపై..
ఈ నెల 3న రైతు వ్యతిరేక విధానాలపై, 4న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్న విధానంపై, 5న విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై పడు తున్న భారం, విద్యుత్ సంస్థలు దివాలా తీయడంపై నిరనన కార్యక్రమాలుంటాయి. అలాగే 6న కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం సంక్షోభం, 7న, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీపై, 8న చెరువుల కబ్జాలపై, 9న సంక్షేమ రంగం ప్రమాదంలో పడటంపై, 10న పెచ్చరిల్లిన అవినీతిపై, 11న తెలంగాణలో కవులు, కళాకారులతో పాటు సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయంపై ప్రచారోద్యమం ఉంటుంది.
12న ‘తెలంగాణ రన్’కు వ్యతిరేకంగా యువ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘రివర్స్ రన్’ఉంటుంది. 13న మహిళలకు అన్యాయంపై, 14న కుంటుపడ్డ వైద్యం–ప్రజల తిప్పలు, 15, 16 తేదీల్లో స్థానిక సంస్థల నిర్వీర్యం, ప్రజాప్రతినిధుల బాధలపై, 17న గిరిజన హామీలు, పోడుభూములు, ఎజెన్సీల్లో ప్రజ ల ఇబ్బందులపై, 18న మంచినీటి సమస్యపై (ఖాళీ బిందెలతో నిరసన), 19న హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధుల దుర్వినియోగంపై, 20న విద్యా వ్యవస్థ దుర్గతిపై, 21న దేవాలయ భూముల కబ్జా, హిందువులపై జరుగుతున్న దాడులపై, 22న తెలంగాణ అమర వీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆ బాధ్యతలను దరువు ఎల్లన్న, పుల్లారావులకు అప్పగించారు.