సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రమిత (పేరు మార్చాం) ప్రస్తుతం రెండో నెల గర్భిణి. ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె బలహీనతకు కారణాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె.. మగపిల్లాడి కోసం ఆరు నెలల గర్భం సహా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈసారీ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమైంది. లింగ నిర్ధారణపై నిషేధం, కఠిన ఆంక్షలు ఉన్నా.. ఇన్నిసార్లు నిర్ధారణ, అబార్షన్లు ఎలా సాధ్యమయ్యాయి? ఓవైపు డయాగ్నొస్టిక్స్ కేంద్రాల అక్రమాలు, మరోవైపు విదేశాలకు వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడుతున్న తీరు పెరుగుతుండటం ఆందోళన రేపుతున్నాయి.
విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తూ..
మన దేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. ఒకవేళ అక్రమంగా పరీక్షలు చేస్తున్నా.. సాధారణ డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడానికి కనీసం గర్భం దాల్చిన 16 వారాల వరకు ఆగాల్సి వస్తోంది. అదే యూకే, అమెరికా, సింగపూర్ వంటి చాలా దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధమేదీ లేదు. పైగా 8 నుంచి 10 వారాల వ్యవధిలోనే నిర్ధారణ చేస్తుండటం, దీనిని రాతపూర్వకంగా కూడా వెల్లడిస్తుంటారు. మగ పిల్లలు కావాలనుకునే జంటలు దీనిని సావకాశంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 9–10 వారాల గర్భిణులు విదేశాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు.
ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటూ..
మన దేశంలో గర్భిణులకు 12 వారాల వరకు అబార్షన్ చేయడానికి చట్టబద్ధంగా వెసులుబాటు ఉంది. విదేశాల్లో లింగ నిర్ధారణ చేయించుకున్నవారు ఆడపిల్ల అని తేలితే.. ఇక్కడికి తిరిగి వచ్చాక ఆస్పత్రులకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటున్నారు. ‘కండోమ్ ఫెయిల్యూర్, గర్భం రాకుండా వేసుకునే మందులు తీసుకోవడం మర్చిపోవడం’ అంటూ ఏదో కారణం చెప్తున్నారు. కొందరైతే లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ కూడా విదేశాల్లోనే చేయించుకుని వస్తున్నారు. ఇందు కోసం థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ‘‘డబ్బున్నవాళ్లు లిఖితపూర్వకంగా లింగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇచ్చే దేశాలకు వెళ్తున్నారు. కొందరు మధ్యతరగతి వారు కూడా మగ పిల్లలు కావాలన్న ఆశతో ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌ను నడిపించే వారి సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రసూతి, గైనకాలజీ సొసైటీకి చెందిన డాక్టర్ శాంత కుమారి చెప్పారు.
చైతన్యం కలిగించడమే మార్గం..
‘‘తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు మన దేశంలో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసుకోవడానికి రూ.25,000 నుంచి రూ. 45,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశాలలోనూ చట్టబద్ధంగా కూడా దాదాపు ఇదే ఖర్చు అవుతుంది. ప్రయాణ ఖర్చులే అదనం. విదేశాల్లో పరిశుభ్రమైన పరిస్థితులలో, సరైన మెడికల్ బ్యాకప్‌తో జరుగుతుంది. దీనితో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దేశం దాటుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు. జంటలలో అవగాహన పెంచడం, చైతన్యం కలిగించడం తప్ప మరోదారి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు.
ఏజెంట్లు, మధ్యవర్తుల వ్యవహారం
లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్, నేరుగా అవాంఛనీయ గర్భాన్ని గానీ తొలగించుకోవాలనుకునే వారి కోసం.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, ఆస్పత్రులకు మధ్య ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ, విషయం బయటికి తెలియకుండా ‘పని’ కానిచ్చేస్తూ.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాల వారికి, ఆస్పత్రులకు వీరే సొమ్ము ముట్టజెప్తుంటారు. ఇలాంటి ఏజెంట్లు, దళారుల వల్ల భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి.
కొడుకు కావాలనే కోరికతో..
మగ పిల్లలు కావాలనే కోరికతో లింగ నిర్ధారణ పరీక్షలకు వెంపర్లాడే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారనేది సాధారణ నమ్మకం. ఈ విషయంలో సంపన్నులు, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కావాలనుకోవడం, అందులోనూ వంశాన్ని కొనసాగించడానికి కొడుకు ఉండాలన్న ఆలోచన, ఆ దిశగా ఇళ్లలో పెద్దల ఒత్తిళ్లు వంటివి.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించేందుకు తెగబడటానికి దారి తీస్తున్నాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: పుడమి తల్లికి తూట్లు!
Comments
Please login to add a commentAdd a comment