గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా 134 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన కొండాపూర్ జిల్లా ఆస్పత్రి నుంచి వర్చువల్‌గా 8 జిల్లాల్లో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్‌లను ప్రారంభించారు. అనంతరం కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో టీ–డయాగ్నొస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 31 జిల్లాలలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలలో రోగులకు ఉచితంగా 134 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా పీహెచ్‌సీలలో నమూనాలు ఇస్తే టీ–డయాగ్నొస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేసి 24 గంటల్లో పేషెంట్, డాక్టర్ల ఫోన్‌లకు రిపోర్ట్‌లు పంపుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే రోగులకు ఉచిత పరీక్షలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
రేడియాలజీ ల్యాబ్‌లలో మహిళల్లో కేన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్, హై అండ్ అల్ట్రాసౌండ్, టీఫా స్కాన్, ఎక్స్‌రే మిషన్, 2డికో ఏకో మిషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. నారాయణ పేట, మేడ్చల్ జిల్లాలలో త్వరలోనే ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే విధంగా ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
కొత్తగా 1,400 మంది ఆశావర్కర్లు
నిమ్స్‌లో త్వరలో రోబోటిక్ వైద్య పరికరాలు తీసుకొచ్చి.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మంచి వైద్య సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కొత్తగా మరో 1,400 మంది ఆశావర్కర్లు రానున్నారని మంత్రి తెలిపారు. కాగా, తెలంగాణ డాక్టర్లు కరోనా సమయంలో చాలా అద్భుతంగా పని చేశారని, ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బండ ప్రకాశ్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ శ్వేత మొహంతి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డాక్టర్ వరదాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment