సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేళనైనా తమపై కనికరించి బదిలీలకు మోక్షం కలిగించాలని 13 జిల్లాల్లోని ఉపాధ్యాయ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల స్పౌజ్ బదిలీలు జరిగినా, మిగతా జిల్లాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టారు. 18 నెలలు కావస్తున్నా అతీగతీ లేకపోవడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలోనైనా ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
2022 జనవరి నుంచి ఇప్పటి వరకు బదిలీల కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మంత్రులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు గోడు వివరిస్తున్నప్పటికీ 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మాత్రం మార్గం సుగమం కావడం లేదు.
జిల్లాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ...
దాదాపు అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపడానికి అవసరమైన ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 21 మంది ఎస్జీటీలు స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ జిల్లాలో సుమారు 300 ఎస్‌జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో కేవలం 5గురు మాత్రమ స్పౌజ్ బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, కానీ అక్కడ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.
స్పౌజ్ బదిలీలు జరగని మిగతా జిల్లాలైన వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. మిగిలిపోయిన 13 జిల్లాల్లోని స్పౌజ్ ఖాళీలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఎందుకు ఆసక్తి చూపడం లేదో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ దంపతులు ఆందోళన చెందుతున్నారు.
భర్త ఓ చోట... పిల్లలు మరోచోట
స్పౌజ్ బదిలీలు జరగకపోవడంతో మహిళా ఉపాధ్యాయుల బాధలు వర్ణణాతీతం. భర్త ఒకచోట, భార్య మరో చోట.. చదువుల కోసం పిల్లలు హైదరాబాద్‌లోనో.. ఉండాల్సి రావడంతో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 18 నెలలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారు కనీసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా తీపి కబురు అందుతుందని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment