వడదెబ్బతో 16 మంది మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 16 మంది మృతి

Published Sun, May 5 2024 3:58 AM

11 People Died Due To Sunburn in Telangana

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరుగురు..  

మృతుల్లో ఎంఈవో, ఒక ఉపాధ్యాయుడు 

ఇద్దరు మహిళలు, ఓ శతాధిక వృద్ధుడు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 16 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవోగా పనిచేస్తున్న కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన బత్తుల భూమయ్య వడదెబ్బతో హఠాన్మరణానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల విజిలెన్స్‌ బృందంలో పనిచేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎండలోనే ఆయన పనిచేయాల్సి వస్తోంది. తీవ్రమైన ఎండవేడికి వడదెబ్బకు గురైన ఆయన చొప్పదండిలోని స్వగృహంలో వేకువజామున కుప్పకూలిపోయారు.

అలాగే జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం మంగేళ శివారు గొండుగూడెంకు చెందిన కొమురం సోము (58) ఎండకు తాళలేక మృతిచెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం భల్లునాయక్‌తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్‌ రామన్న (45) శుక్రవారం గజ్వేల్‌లో జరిగిన ఎన్నికల శిక్షణకు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, రాత్రి ఆయన ఆరోగ్య క్షీణించడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు (56) మధ్యాహ్నం ఎండకు తాళలేక ఇంటి సమీపంలో కింద పడిపోయారు. ఆయనను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొల్లాపూర్‌ మండలంలోనే ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రు నాయక్‌ (80) కొల్లాపూర్‌ వెళ్లి మధ్యాహ్నం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మరో ఘటనలో మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గొడిశాల దేవయ్య(70) ఎండ తీవ్రతకు మృతిచెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో వడ్డె యాదయ్య (72) పత్తికట్టె తొలగించే పనులు చేస్తుండగా సొమ్మసిల్లి మృతి చెందారు. అలాగే గజ్వేల్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పక్కన స్పృహ తప్పి పడిపోయిన వర్గల్‌ మండలం వేలూరుకు చెందిన దార నాగయ్య(45)ను పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..  
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడదెబ్బ కారణంగా శనివారం ఆరుగురు మృతిచెందారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్‌చెడ గ్రామానికి చెందిన ఆకుల భాస్కర్‌ (25), హరియా తండాకు చెందిన శతాధిక వృద్ధుడు బాదావత్‌ నర్సింహ(100) ఎండ వేడికి తాళలేక చనిపోయారు. నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన అజ్మీర మంగ్యా (45) అనే రైతు ఎండ తీవ్రతకు మృతిచెందారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన వంక లక్షి్మ(67) వడదెబ్బతో తనువు చాలించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గాం«దీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య(75) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేకల లస్మయ్య (56) అనే రైతు ప్రాణాలు కోల్పోయారు.  

పనిచేస్తున్న చోటే..
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామంలో భూమిని రాములు (71) ఉపాధిహామీ పనుల్లో భాగంగా పలుగుతో మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడి చేరుకున్న వైద్యులు రాములును పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. వారం రోజులుగా వరుసగా ఉపాధి పనులకు హాజరు కావడంతో రాములుకు వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగుల గ్రామానికి చెందిన మహిళా కూలీ బోల్లబోయిన వనమాల (45) ధాన్యం ఆరబెట్టేందుకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందారు. 

Advertisement
 
Advertisement