వివాదం పరిష్కారం కోసం వెళ్తే.. ఎదురైన కొత్త సమస్య
65 ఏళ్ల క్రితమే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు
కొనుగోలుదారుల్లో కలవరం
మిర్యాలగూడలో ముదిరిన పొలిటికల్ వార్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ రివేంజ్ కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులను రాజకీయంగా సమాధి చేసేలా ఎత్తులు వేస్తున్నారు. అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం విశేషం. మిర్యాలగూడలో ప్రముఖ ప్రజాప్రతినిధికి ప్రత్యర్థి గ్రూప్‌లో ఆర్థిక విభేదాలు కలిసి వచ్చాయి. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడగా సుమారు రూ.20 కోట్ల విలువైన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
పది గుంటల ప్రభుత్వ భూమి..
మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖుల మధ్య భూ వివాదం చినికిచినికి గాలివానలా మారి 65 సంవత్సరాల క్రితం జరిగిన భూ కుంభకోణం బయటపడింది. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌రోడ్డుపై సర్వే నంబర్ 992లో సుమారు పదిగుంటల భూవివాదం పరాకాష్టకు చేరింది. భూమి అమ్మకాల విషయంలో ఎంపీ ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరిన పదవిలో ఉన్న ప్రముఖుడు, మరో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. సదరు భూమిలో తన 35శాతం వాటా అమ్ముతా రూ.15 కోట్లు ఇవ్వాలని, లేదా.. మీ చేతిలో ఉన్న 65 శాతం భూమి అమ్మితే రూ.9కోట్లు ఇస్తానని పేచీ పెట్టడంతో విసిగిపోయిన ఇద్దరు.. ప్రధాన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆ భూమి గత వివరాలు తెలుసుకునే పనిలో భాగంగా పహాణీ తీయడంతో ఆ భూమి కాస్తా ఆబాది గ్రామ కంఠం భూమిగా తేలింది. 1977–78లో గ్రామ కంఠం భూమిగా నమోదు కావడం, అందులో 8.38 ఎకరాల భూమి ఆబాది (గ్రామకంఠం)లోనిదిగా తేలింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ నెల 19న ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు.
రాజకీయ విభేదాలతో వెలుగులోకి..
ఈ భూ కుంభకోణం బయటికి రావడానికి అధికార పార్టీ నేత హస్తం ఉందని, ఇందుకు రాజకీయ విభేదాలు కూడా కారణమని తెలుస్తోంది. చట్టసభలో ఉన్న ప్రతినిధిని బాధితులు ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చిందని సమాచారం. మొత్తం మీద 65 సంవత్సరాల క్రితం ఆ భూమిలో అప్పటి పట్టణ మున్సిపల్ చైర్మన్ నివాసం ఉండి ఆయన మున్సిపాలిటీ తరఫున షాపులు నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఆయన మరణించిన అనంతరం ఆ స్థలాన్ని అమ్మేశారు. ఇప్పటివరకు నాలుగైదు చేతులు మారాయి. ప్రస్తుతం పొత్తులో ఉన్న స్థలాన్ని తాత్కాలికంగా అద్దెకిచ్చారు. ఆ అద్దెలను కూడా పట్టణ ప్రజాప్రతినిధి తీసుకోవడంతో వారిలో ఆర్థిక వివాదం మరింత పెరిగింది. ఇప్పుడు ఆ భూమి కొనుగోలుదారుల్లో కలవరం మొదలైంది.
డాక్యుమెంట్లను పరిశీలిస్తాం
మిర్యాలగూడ సర్వే నంబర్ 992లో సుమారు పది గుంటల భూమి మీకు ఎలా వచ్చిందో చెప్పాలని కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరాం. కొనుగోలుదారులు ఒక్కరోజులోనే సమాధానం ఇచ్చారు. వారిచ్చిన సమాధానం, డాక్యుమెంట్లు, ఆధారాలను ఉన్నతాధికారులకు సమర్పించాం. ఆ డాక్యుమెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం
– వెంకన్న, మున్సిపల్ డీఈ
Comments
Please login to add a commentAdd a comment