స్కిల్స్‌ యూనివర్సిటీకి ‘మేఘా’ రూ.200 కోట్లు | 200 crore allocated to Megha Engineering and Infrastructures Limited Skills University | Sakshi
Sakshi News home page

స్కిల్స్‌ యూనివర్సిటీకి ‘మేఘా’ రూ.200 కోట్లు

Published Sun, Oct 27 2024 4:32 AM | Last Updated on Sun, Oct 27 2024 4:32 AM

200 crore allocated to Megha Engineering and Infrastructures Limited Skills University

సీఎస్‌ఆర్‌ కింద భవనాలు నిర్మించేందుకు సుముఖత

సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ ప్రతినిధుల సంప్రదింపులు

ప్రభుత్వంతో ఎంవోయూ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎస్‌) సంస్థ ముందుకు వచ్చింది. యూనివర్సిటీ భవన సముదాయం నిర్మాణం కోసం సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ స్థాయి లో అధునాతన వసతులు ఉండేలా మేఘా సంస్థ యూనివర్సిటీ భవనాలను నిర్మి స్తుంది. 

ఈ మేర కు శనివారం సీఎం రేవంత్‌ రెడ్డితో ‘మేఘా’ఎండీ కృష్ణారెడ్డితో పాటు సంస్థ ప్రతినిధుల బృందం సచివాలయంలో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ అనిల్‌ కుమార్‌యాదవ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అకడమిక్‌ బిల్డింగ్, వర్క్‌ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్‌ భవనాలు నిర్మిస్తామని కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్‌లతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూ నాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు.

వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. నవంబర్‌ 8వ తేదీ నుంచి వర్సిటీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా సంస్థ శనివారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ వీఎల్వీఎస్‌ఎస్‌ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. హైదరాబాద్‌ శివారులోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌ ఇటీవల భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement