2,700 బస్సుల కోసం మూడు కంపెనీలతో ఆర్టీసీ చర్చలు
జీసీసీ పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు
కి.మీ. అద్దె రూ.60గా ఉండే అవకాశం
దశలవారీగా ఏడాదిన్నరలో బస్సులు సమకూరే వీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులు లేకుండా పూర్తిగా బ్యాటరీ బస్సులే నడిపేలా ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 2,700 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు, దేశంలోనే ప్రధాన బ్యాటరీ బస్సు తయారీ సంస్థలతో చర్చలు మొదలుపెట్టింది. మూడు కంపెనీలను సంప్రదించిన ఆర్టీసీ అధికారులు, వాటికి నిర్వహణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాటరీ బస్సుల నిర్వహణను.. ఒక్కో దఫాలో ఒక్కో కంపెనీకి అప్పగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి పెద్దసంఖ్యలో బస్సులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున, ఒకే కంపెనీకి కాకుండా మూడు కంపెనీలకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారు.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్‌తో..
ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2,700 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఎలక్ట్రిక్ బస్సులు వందలోపే ఉన్నాయి. మిగతా అన్నీ డీజిల్ బస్సులే. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం బ్యాటరీ బస్సులనే వాడాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరీ్టసీని ఆదేశించారు. ఈమేరకు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఒక్కో బస్సు ధర రూ.1.85 కోట్లు ఉన్నందున, 2,700 బ్యాటరీ బస్సులను సంస్థ సొంతంగా కొనడం దాదాపు అసాధ్యం. దీంతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒలెక్ట్రా, జేబీఎం కంపెనీల నుంచి కొన్నింటిని జీసీసీ పద్ధతిలో నిర్వహిస్తోంది. ఇటీవలే జేబీఎం నుంచి తీసుకున్న బస్సులకు ఒక కిలోమీటరుకు ఆర్టీసీ రూ.57.90 చొప్పున అద్దె చెల్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకునే బస్సులకు ఈ మొత్తం రూ.60 దాటే అవకాశం ఉంది.
ఈ పద్ధతిలో తీసుకునే బస్సుల్లో ఆ కంపెనీలే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కండక్టర్లను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న బస్సుల్లో కండక్టర్ల ఖర్చు కిలోమీటరుకు రూ.18 ఉంటోంది. రూ. 60 అద్దె అనుకున్నా.. కండక్టర్ల ఖర్చుతో కలుపుకొంటే ఆ మొత్తం రూ.78 వరకు చేరుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచి్చన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 100 శాతాన్ని దాటింది. ఈపీకే (కి.మీ.కు ఆదాయం) రూ.90గా ఉంటోంది. కండక్టర్ల వేతనం ప్లస్ బస్సుల అద్దె కలిపి రూ.78 కాగా.. ఈపీకే రూ.90గా ఉండటంతో ఆరీ్టసీకి మార్జిన్ కి.మీ.కు రూ.12 వరకు ఉంటుంది. ఇందులో నిర్వహణ ఖర్చులు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆరీ్టసీకి పెద్ద నష్టం కాబోదని అధికారులు భావిస్తున్నారు.
3 వేలు దాటనున్న బ్యాటరీ బస్సులు..
హైదరాబాద్‌లో నడిపేందుకు వీలుగా ఆర్టీసీ ఇప్పటికే ఐదొందల బ్యాటరీ బస్సులకు ఆర్డరిచి్చంది. దశలవారీగా అవి సమకూరనున్నాయి. ఇప్పుడు మరో 2,700 బస్సులకు కొత్తగా ఆర్డరిస్తే.. మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలను మించనుంది. దశలవారీగా మరో ఏడాదిన్నరలో అవి అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment