కొత్త మెడికల్‌ కాలేజీలపై టెన్షన్‌ | 8 Medical Colleges Temporary Building Not Ready in Telangana | Sakshi
Sakshi News home page

కొత్త మెడికల్‌ కాలేజీలపై టెన్షన్‌

Published Thu, May 19 2022 4:15 AM | Last Updated on Thu, May 19 2022 3:50 PM

8 Medical Colleges Temporary Building Not Ready in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాబోయే వైద్య విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలనుకున్న 8 కొత్త మెడికల్‌ కాలేజీలపై టెన్షన్‌ నెలకొంది. ఈ కాలేజీలకు సంబంధించి తాత్కాలిక భవనాలు ఇంకా పూర్తికాకపోవడం కలవరపెడుతోంది. కొత్తగా కడుతున్న కాలేజీ భవనాలను జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సభ్యుల బృందం ఈమధ్య ఓసారి వచ్చి చూసి లోపాలు తెలియజేసినా వైద్యారోగ్య యంత్రాంగం ఇంకా సరిదిద్దలేదు. త్వరలో మరోసారి ఎన్‌ఎంసీ బృందం పరిశీలనకు రానుండటంతో అప్పటికీ లోపాలు సరిదిద్దకపోతే, భవనాలు పూర్తికాకపోతే అనుమతులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే అనుమతుల కోసం కేంద్రం వద్దకు వెళ్లి వేడుకోవాల్సిన పరిస్థితి రానుంది. 

8 కాలేజీలకు రూ.4,080 కోట్లు 
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్‌ కాలేజీలున్నాయి. 2022–23 వైద్య విద్యా సంవత్సరం నుంచి మరో 8 కాలేజీలు ఒకేసారి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌ కర్నూల్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీ స్థాపనకు ప్రభుత్వం రూ. 510 కోట్లు కేటాయించింది.8 కాలేజీలకు రూ. 4,080 కోట్లు ఖర్చు కానుంది. ప్రతి కాలేజీకి కనీసం 20 ఎకరాల భూమి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో భవనాల నిర్మాణం ఆర్‌అండ్‌బీకి అప్పగించారు.  

4 కాలేజీలు సిద్ధం కావొచ్చేమో.. 
కాలేజీ భవనాలను శాశ్వత పద్ధతిలో నిర్మించాలంటే కనీసం 18 నెలలు పడుతుంది. కాబట్టి ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతిలో మొదటి ఏడాది తరగతుల కోసం కాలేజీ భవనం, పరిపాలనా భవనం, హాస్టల్‌ తాత్కాలికంగా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే పరికరాలు, మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. హాళ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, డెమో గదులు నిర్మించాలి. అయితే ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో భవన నిర్మాణాలు పూర్తవలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి ఎన్‌ఎంసీ వచ్చే నాటికి 4 కాలేజీల నిర్మాణం పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. మిగిలిన వాటికి అనుమతులు తీసుకురావడం కష్టమైన వ్యవహారంగా మారనుంది. కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

సక్రమంగా ఉంటే అనుమతి.. 
ఎన్‌ఎంసీ బృందం మళ్లీ వచ్చే నాటికి నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటే వాటికి అనుమతులు మంజూరు చేస్తారు. ఆ మేరకు వచ్చే వైద్య విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహించుకోవచ్చు. పైగా వచ్చే నీట్‌ పరీక్ష తర్వాత కాలేజీల పేర్లు నోటిఫై చేసే నాటికి వీటి జాబితా ఖరారు కావాలి. లేకుంటే చిక్కులే. సగం కాలేజీలు పూర్తయితే మిగతా కాలేజీలకు అనుమతుల కోసం కేంద్రం వద్దకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) సహా సంబంధిత అధికారులు వెళ్లి ప్రత్యేక హామీ పత్రం ఇచ్చి రావాల్సి ఉంటుంది. తరగతులు ప్రారంభమయ్యే నాటికి వాటిని కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామన్న గ్యారంటీ ఇవ్వా లి. అందుకు ఒప్పుకుంటే అనుమతులిస్తాయి. ఈ పరిస్థితి వచ్చిందంటే కాంట్రాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. తరగతులు ప్రారంభించేందుకు కీలకమైన తాత్కాలిక భవనాలను గత నవంబర్, డిసెంబర్‌ నాటికే పూర్తి చేయాలకున్నా ఆలస్యమైంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement