
సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. పట్టణాలతో పాటు పల్లెలను వణికిస్తోంది. తాజాగా జిల్లాలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. సిర్పూర్ టీ మండలం ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి కొమరం బాలు ధ్రువీకరించారు. అదేవిధంగా కాగజ్ నగర్‌లో ఇద్దరికి.. రెబ్బెన పీహెచ్‌సీలో పని చేస్తోన్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాక ఆసిఫాబాద్‌లో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్లతో పాటు కసాబ్‌వాడకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరుకుంది.