చిన్నారి ఆధార్ వివరాలు నమోదు చేస్తున్న తపాలా సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కావాలా.. అయితే పోస్టాఫీస్‌కు ఫోన్ చేయండి.. సిబ్బంది మీ ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసి ఆధార్‌కార్డు అందించే ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తపాలా శాఖకు అనుమతినిచ్చింది. ఐదేళ్లలోపువారికి కూడా ఆధార్ అవసరమైన నేపథ్యంలో వివరాల నమోదు కోసం చిన్నారులను తీసుకుని ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనే తంతు పూర్తి చేసేలా తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది.
ఇందుకుగాను 28 గ్రామీణ జిల్లాల్లోని పోస్ట్‌మన్లు, 1,552 గ్రామీణ్ డాక్ సేవక్‌లకు యూఐడీఏఐ సర్టిఫై చేసింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ ఆధార్ నమోదు ప్రక్రియ వేగంగా సాగేందుకు మహిళా, శిశు సంక్షేమ, విద్యాశాఖలతో సమన్వయం చేసుకుంటూ అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను అధికారులు, అంగన్‌వాడీ కేంద్ర ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులకు లేఖలు రాస్తోంది.
బయోమెట్రిక్ లేకుండా...
ఆధార్‌లో పేర్ల నమోదుకు బయోమెట్రిక్ తప్పనిసరి అయినా, ఐదేళ్లలోపు చిన్నారులకు మినహాయింపు ఇచ్చారు. చిన్నారుల వేలిముద్ర లు స్పష్టంగా ఉండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ధారిత వయసు వచ్చాక మళ్లీ వారి వేలిముద్రలు తీసుకోవటం ద్వారా ఆధార్ అప్‌డేట్ చేస్తారు. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రుల బయో మెట్రిక్ తీసుకుని, జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) ప్రతి సమర్పించటం ద్వారా వారి పేర్లు నమోదు చేయించొచ్చు.
ఈ ప్రక్రియను ఉచితంగా నిర్వహిస్తారు. గతంలో ఐదేళ్ల కంటే పెద్ద వయసువారికి తపాలా కార్యాలయాల్లో, ప్రత్యేక శిబిరాల్లో తపాలా శాఖ ఆధార్ వివరాలను నమోదు చేయించింది. వారికి ఆధార్ కార్డులను యూఐడీఏఐ పోస్ట్ ద్వారా పంపింది. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకు లక్షమంది వివరాలను తపాలాశాఖ ద్వారా నమోదు చేయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment