సాక్షి, హైదరాబాద్: పేద, ధనిక తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే దేశంలోని ప్రతి పౌరుడికీ భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య అందులో ఉంటుంది. అంతేకాదు ఈ కార్డు బహుళ ప్రయోజనకారి. అన్నిటికీ అనుసంధానమవుతూ, ప్రతిదానికీ ఆధారమవుతోంది. ఆధార్ కార్డు లేకుండా ఏ పనీ జరగదన్నట్టుగా దాని ప్రాధాన్యత పెరిగిపోయింది.
బ్యాంకింగ్, బీమా, పన్నులు తదితర లావాదేవీలకు, డిజిటిల్ కార్యకలాపాలకు, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్ అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరూ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ నమోదు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం గమనార్హం.
అంచనా జనాభా దాటి..
తెలుగు రాష్ట్రాల్లో జనాభా కంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అంచనా వేసిన జనాభా కంటే కూడా ఆధార్ నమోదు సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నవారు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్న కారణంగా ఈ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఆధార్ కార్డుల జారీ సంఖ్య నాలుగు కోట్ల తొమ్మిది లక్షల పైచిలుకుగా ఉంది. అంచనా వేసిన జనాభా (3.79 కోట్లు) సంఖ్య కంటే 29.98 లక్షలు (7.91 శాతం) ఎక్కువగా ఆధార్ నమోదు కావడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 3.51 కోట్ల జనాభా ఉండగా 2022 అంచనాల ప్రకారం ఈ సంఖ్య 3.79 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంఖ్య 4.93 కోట్ల నుంచి ప్రస్తుతం 5.29 కోట్లకు చేరింది. ఐదుకోట్ల 46 లక్షల ఆధార్ కార్డులు జారీ కాగా, అంచనా జనాభా కంటే 17.05 లక్షలు (3.21 శాతం) అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద 18 ఏళ్లు దాటిన వారే అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకొని విశిష్ట నంబర్లు పొందినట్లు యూఐడీఏఐ వర్గాలు పేర్కొటున్నాయి.
గత రెండు నెలల్లో ఎక్కువగా
గడిచిన రెండు నెలల్లో ఆధార్ నమోదు సంఖ్య బాగా పెరిగింది. ఏడాది కాలం (ఆగస్టు 2021 నుంచి 2022 జూలై 31 వరకు) పరిశీలిస్తే.. తెలంగాణలో 6,10, 236 మంది నమోదైతే అందులో కేవలం జూన్, జూలైలోనే 1,25,665 మంది నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో 7,71,818 మంది నమోదైతే అందులో రెండు నెలల్లో 1,72,614 నమోదు చేసుకున్నట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పురుషులు, మహిళలు సమానంగా..
ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో 50.11 శాతం పురుషులు, 49.89 శాతం మహిళలు, ఏపీలో 50.43 శాతం పురుషులు, 49.57 శాతం మహిళలు ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
18 ఏళ్లు పైబడిన వారే అధికం
ఆధార్ నమోదు చేసుకున్న వారిలో 18 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. తెలంగాణలో 18 ఏళ్లు దాటిన వారు 77.51 శాతం ఉండగా అందులో పురుషులు 38.92 శాతం, మహిళలు 38.59 శాతం ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోçపు వారు 19.55 శాతం ఉండగా, అందులో బాలురు 10.02 శాతం, బాలికలు 9.47 శాతం ఉన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 2.99 శాతం ఉండగా అందులో బాలురు 1.48 శాతం, బాలికలు 1.51 శాతం ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
►ఏపీలో 18 ఏళ్లు దాటిన వారు 78.16 శాతం ఉండగా అందులో 38.92 శాతం పురుషులు, 39.24 శాతం మహిళలు ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోపు వారు 18.13 శాతం ఉంటే అందులో 9.31 శాతం బాలురు, 8.82 శాతం బాలికలు, ఐదేళ్లలోపుగల వారు 3.7 శాతం ఉండగా అందులో బాలురు 1.87 శాతం, బాలికలు 1.83 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ టాప్
ఆధార్ నమోదులో గ్రేటర్ హైదరాబాద్ టాప్‌గా ఉంది. అంచనా జనాభాకంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయి. మహానగరంలో జనాభా వృద్ధి రేటు ఏటా 8 నుంచి 12 శాతం వరకు ఉంటోంది. 2022 అంచనా ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.05 కోట్ల జనాభా ఉండగా ఆధార్ నంబర్లు జారీ సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అంటే జనాభా కంటే 20 లక్షలు (19 శాతం) అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వస్తున్నవారు ఎప్పటికప్పుడు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటుండటంతో జనాభా కంటే ఆధార్ అధికంగానే నమోదైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment