చెరువుల భూముల్లో నిర్మాణాలకు అక్రమంగా అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై చర్యలు
సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీస్ కమిషనర్
‘హైడ్రా’ ఫిర్యాదు మేరకు నిర్ణయం.. త్వరలో మరికొందరిపైనా చర్యలు
సాక్షి, హైదరాబాద్: నాలాలు, చెరువుల్లో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువు, ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో ఆరుగురు అధికారులపై కమిషనర్ కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తుల నష్టం, నివారణ చట్టం (పీపీపీఏ)–1984, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.
పోలీసుశాఖ తరహాలో హైడ్రా విశ్లేషణ..
హైడ్రా ఒకవైపు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూలుస్తూనే.. మరోవైపు ఆయా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీసు శాఖ తరహాలో సమగ్ర పరిశీలన చేపట్టింది. దరఖాస్తు దశ నుంచి అనుమతుల వరకు నిర్మాణదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను క్షుణ్నంగా పరిశీలించింది.
నిర్మాణదారులతో కుమ్మక్కైన అధికారులు సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకుంటున్నట్టు గుర్తించింది. కొన్ని విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగులు అభ్యంతరం తెలిపినా కొందరు పైస్థాయి అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు తేల్చింది. సదరు అధికారుల పేర్లు, వివరాలు, తప్పిదాలకు ఆధారాలను, సాంకేతిక అంశాలను సేకరించాక.. బాధ్యులపై సంబంధిత పోలీసు కమిషనర్లకు ఫిర్యాదు చేస్తోంది.
అధికారుల అరెస్టులు ఉంటాయా?
ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదైన అధికారులను అరెస్టు చేస్తారా? లేదా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ తరహా కేసులలో అరెస్టుల విషయంలో.. సంబంధిత విచారణాధికారి (ఐఓ)దే అంతిమ నిర్ణయమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. నిందితులు విచారణకు రాకుండా తప్పుంచుకుంటారని, పరారవుతారని, అజ్ఞాతంలోకి వెళ్లిపోవచ్చని విచారణాధికారి భావిస్తే.. సెక్షన్ 409 కింద అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తారని తెలిపారు. లేకపోతే అధికారులకు నోటీసులు జారీ చేసి, విచారణ కొనసాగిస్తుంటారని వివరించారు.
త్వరలో మరికొందరిపైనా కేసులు
హైడ్రా దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో.. త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చిట్టా బయటకొస్తుందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే మరికొందరు అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటివరకు 10 వేల మంది ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యా యి.
గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని సీనియర్ ఇంజనీర్లపైనా హైడ్రా విచారణ జరపనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఒక ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయగా.. మరికొందరిపై చర్యలు ఉంటాయని సమాచారం. మరోవైపు గండిపేట జలాశయం సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యల కోసం హైడ్రా సంబంధిత విభాగానికి సిఫార్సు చేసింది.
కేసులు నమోదైన అధికారులు వీళ్లే..
» రామకృష్ణారావు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్
» సుధాంశు, చందానగర్ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్
» పూల్ సింగ్ చౌహాన్, బాచుపల్లి ఎమ్మార్వో
» శ్రీనివాసులు, మేడ్చల్–మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్
» సుధీర్‌కుమార్, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్
» రాజ్‌కుమార్, హెచ్‌ఎండీఏ సిటీ ప్లానర్
Comments
Please login to add a commentAdd a comment