building constructions
-
అధికారులపై కేసులు షురూ!
సాక్షి, హైదరాబాద్: నాలాలు, చెరువుల్లో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువు, ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో ఆరుగురు అధికారులపై కమిషనర్ కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తుల నష్టం, నివారణ చట్టం (పీపీపీఏ)–1984, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.పోలీసుశాఖ తరహాలో హైడ్రా విశ్లేషణ..హైడ్రా ఒకవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూలుస్తూనే.. మరోవైపు ఆయా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పోలీసు శాఖ తరహాలో సమగ్ర పరిశీలన చేపట్టింది. దరఖాస్తు దశ నుంచి అనుమతుల వరకు నిర్మాణదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను క్షుణ్నంగా పరిశీలించింది. నిర్మాణదారులతో కుమ్మక్కైన అధికారులు సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకుంటున్నట్టు గుర్తించింది. కొన్ని విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగులు అభ్యంతరం తెలిపినా కొందరు పైస్థాయి అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు తేల్చింది. సదరు అధికారుల పేర్లు, వివరాలు, తప్పిదాలకు ఆధారాలను, సాంకేతిక అంశాలను సేకరించాక.. బాధ్యులపై సంబంధిత పోలీసు కమిషనర్లకు ఫిర్యాదు చేస్తోంది.అధికారుల అరెస్టులు ఉంటాయా?ఈ వ్యవహారంలో క్రిమినల్ కేసులు నమోదైన అధికారులను అరెస్టు చేస్తారా? లేదా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. సాధారణంగా ఈ తరహా కేసులలో అరెస్టుల విషయంలో.. సంబంధిత విచారణాధికారి (ఐఓ)దే అంతిమ నిర్ణయమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. నిందితులు విచారణకు రాకుండా తప్పుంచుకుంటారని, పరారవుతారని, అజ్ఞాతంలోకి వెళ్లిపోవచ్చని విచారణాధికారి భావిస్తే.. సెక్షన్ 409 కింద అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తారని తెలిపారు. లేకపోతే అధికారులకు నోటీసులు జారీ చేసి, విచారణ కొనసాగిస్తుంటారని వివరించారు.త్వరలో మరికొందరిపైనా కేసులుహైడ్రా దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో.. త్వరలోనే మరికొందరు అధికారుల అవినీతి చిట్టా బయటకొస్తుందనే చర్చ జరుగుతోంది. త్వరలోనే మరికొందరు అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేయడం గమనార్హం. ఇప్పటివరకు 10 వేల మంది ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యా యి.గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని సీనియర్ ఇంజనీర్లపైనా హైడ్రా విచారణ జరపనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఒక ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయగా.. మరికొందరిపై చర్యలు ఉంటాయని సమాచారం. మరోవైపు గండిపేట జలాశయం సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై క్రమశిక్షణ చర్యల కోసం హైడ్రా సంబంధిత విభాగానికి సిఫార్సు చేసింది. కేసులు నమోదైన అధికారులు వీళ్లే..» రామకృష్ణారావు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్» సుధాంశు, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్» పూల్ సింగ్ చౌహాన్, బాచుపల్లి ఎమ్మార్వో» శ్రీనివాసులు, మేడ్చల్–మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ » సుధీర్‌కుమార్, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్» రాజ్‌కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ -
నిర్మాణ ప్లాన్స్‌లో డిజిటల్ ఇన్ఫ్రాను చేర్చాల్సిందే!
న్యూఢిల్లీ: భవంతుల నిర్మాణ ప్రణాళికల్లో నీరు, విద్యుత్, గ్యాస్ మొదలైన వాటికి సదుపాయాలు కల్పించినట్లుగానే డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రా (డీసీఐ)కి కూడా చోటు కల్పించాలని ప్రభుత్వానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ సూచించింది. డీసీఐ కల్పన, నిర్వహణ, అప్‌గ్రెడేషన్ తదితర అంశాలను కూడా తప్పనిసరిగా పొందుపర్చేలా చూడాలని సూచించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ చట్టం రెరాలో తగు నిబంధనలను చేర్చాలని పేర్కొంది. ‘డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించి భవంతులకు రేటింగ్’ అంశంపై ప్రభుత్వానికి ఈ మేరకు ట్రాయ్ సిఫార్సులు చేసింది. అపార్ట్మెంట్లు లేదా రియల్టీ ప్రాజెక్టుల్లో ఏదో ఒక నిర్దిష్ట టెల్కో గుత్తాధిపత్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వైర్లెస్ పరికరాలను ఇన్స్టాల్ చేయడం టెలికం లేదా ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు హోల్డర్ బాధ్యతగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది. బిల్డింగ్‌ల్లో డీసీఐ ప్రస్తుత ప్రమాణాలు, ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు అప్పగించాలని పేర్కొంది. డిజిటల్ సేవల పటిష్టంపై త్వరలో చర్చాపత్రం దేశీయంగా డిజిటల్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోదగిన చర్యలపై కూడా ట్రాయ్ దృష్టి సారిస్తోంది. డివైజ్‌లు, కనెక్టివిటీ, డిజిటల్ అక్షరాస్యతపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన చర్చాపత్రాన్ని రాబోయే నెలల్లో విడుదల చేయనున్నట్లు ఇండియా డిజిటల్ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు. దేశవ్యాప్తంగా టెల్కోలు 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డివైజ్‌ల రేట్లు అధికంగా ఉన్నాయని సామాన్య ప్రజానీకం భావిస్తున్న నేపథ్యంలో వాఘేలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే 25 ఏళ్లలో దేశీయంగా డిజిటల్ వినియోగాన్ని వేగవంతం చేయాలంటే డిజిటల్ గవర్నెన్స్ మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీపై విధానాల రూపకల్పన వంటి ఎనిమిది కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని వాఘేలా చెప్పారు. ప్రజోపయోగకరమైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ వ్యవస్థలతో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు మన దేశ పరిస్థితులకు ఉపయోగపడేలా వినూత్న డిజిటల్ ఆవిష్కరణలను రూపొందించాల్సిన అవసరం ఉందని వాఘేలా తెలిపారు. -
భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలి
గుంటూరు వెస్ట్: ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించి ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ప్రాధాన్యతా భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, విలేజ్ వెల్నెస్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేలు, బీఎంసీయులు నిర్మాణాల్లోని ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరిస్తానన్నా రు. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని భవనాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అధికారులు వివరాలను కలెక్టర్‌కు అందిస్తూ 154 ఆర్బీకేలకుగాను 43 పూర్తి చేశామన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు 164కుగాను 47, గ్రామ సచివాలయాలు 206కు గాను 110, 25 బీఎంసీయూలకు గాను 2, డిజిటల్ లైబ్రరీలు 92కు గాను 49 పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి మొత్తం భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న జగనన్న లే అవుట్స్‌లో నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా నిర్మాణాల్లో కొంత ఆలస్యమేర్పడిందన్నారు. తొలి దశలో మంజూరైన 68,989 ఇళ్ల నిర్మాణాలను అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు. ఇందులో 42,821 ఇళ్లు బీబీఎల్, 12,394 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 1200 గృహాలు రూప్ లెవెల్, 2430 ఇళ్లు ఆర్సీ లెవెల్స్‌లో ఉన్నాయన్నారు. కాలనీలకు అప్రోచ్ రోడ్లు, లెవెలింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి మిగతాఇళ్ల బేస్మెంట్ పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్‌లు నిరంతరాయంగా అందించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, మెప్మా పీడీలు హరిహరనాథ్, వెంకట నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోండి ప్రతి వృత్తిలో సాంకేతికత పెరుగుతోందని దాంట్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి మార్గాలు మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్కిల్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో గుంటూరు ఐటీఐ, పొన్నూరులోని చేబ్రోలు ప్రభు త్వ కళాశాలలో, తెనాలిలోని ఐటీఐ కళాశాలలో హబ్‌ను ప్రారంభించి శిక్షణ ప్రారంభిస్తారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సీడ్యాప్, ఎన్ఏసీ, ఆర్ఎస్టీఐ, జన శిక్షణా సంస్థలు ఎవరికి వారు నిరుద్యోగులకు శిక్షణ నిచ్చేవారన్నారు. ఇక నుంచి స్కిల్ హబ్‌లలో కమిటీల ద్వారా అవసరమైన శిక్షణనిస్తారన్నారు. జాతీయస్థాయి పరిశ్రమలు, జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగులను స్కిల్డ్ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో వెబ్, యాప్ డిజైనింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, సోలార్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రిక్, ప్లంబరింగ్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనా«థ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రణయ్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకరరావు, అధికారులు పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి భవన నిర్మాణానికి సంబంధించిన స్థలంపై అభ్యంతరాలను లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇందిరాగేట్కు మధ్య మూడు కిలోమీటర్ల పొడవునా కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల పైచిలుకు వ్యయంతో సెంట్రల్ విస్టా పునర్వ్యవస్టీకరణ ప్రాజెక్టును చేపట్టడం తెల్సిందే. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాసం, పీఎంఓ, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తారు. రిక్రియేషనల్ కార్యాకలాపాలకు, పచ్చదనానికి ఉపయోగించాల్సిన ప్లాట్‌ను ఉపరాష్ట్రపతి నివాస భవన నిర్మాణానికి ప్రతిపాదించారని, భూవినియోగమార్పిడి నిబంధనలకు ఇది విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. విమర్శించడం తేలికని, కానీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలని, సంబంధితవర్గాలు ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలంపై సరైన వివరణ ఇచ్చాయని... ఇక ఇందులో కల్పించుకోవడానికి ఏమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రూ. 206 కోట్లతో నిర్మాణం ఉప రాష్ట్రపతి కొత్త నివాస భవనం, అధికారిక కార్యాలయ సముదాయ నిర్మాణానికి రూ. 206 కోట్ల వ్యయం కానుంది. జార్ఖండ్‌లోని బొకారో కేంద్రంగా పనిచేస్తున్న కమలాదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ ఈ నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రజాపనుల విభాగం రూ. 214 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా... మొత్తం ఐదు సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో కమాలాదిత్య కంపెనీ 3.52 లెస్తో కోట్ చేసి నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. పనులు వచ్చేనెలలో ప్రారంభమై 10 నెలల్లో పూర్తికానున్నాయి. -
ఏ అంతస్తులోనైనా తనఖా..
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై ఏ అంతస్తులోనైనా 10 శాతం నిర్మిత స్థలాన్ని అనుమతులు జారీ చేసే విభాగానికి తనఖా పెట్టవచ్చు. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం... నిర్మించనున్న భవనంలోని గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో 10% నిర్మిత ప్రాంతాన్ని అను మతులు జారీ చేసే ప్రభుత్వ యం త్రాంగం (పురపాలిక) పేరుతో తనఖా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాల్లో లేదా పాత భవనాలను కూల్చి వేసి ఆ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి ఆయా స్థలాల యజమానులతో డెవలపర్లు ఒప్పందం చేసుకుంటుంటారు. ఈ ఒప్పందాల్లో భూయజమానికి, డెవలపర్ల మధ్య స్పష్టమైన వాటాలను నిర్దేశించుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్/ ఫస్ట్ ఫ్లోర్/ సెకండ్ ఫ్లోర్లలోని ఫ్లాట్లను తమ వాటా కింద భూయజమానులు తీసుకున్న సందర్భాల్లో వాటిని తనఖా పెట్టడానికి విముఖత చూపుతుండటంతో భవన అనుమతులు పొందడానికి డెవలపర్లు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డెవలపర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నిర్మించనున్న భవనంలోని ఏ అంతస్తులోనైనా 10శాతం నిర్మిత ప్రాంతాన్ని తనఖా పెట్టడానికి అనుమతిస్తూ భవన నిబంధనలకు ప్రభుత్వం కీలక సవరణలు జరిపింది. అనుమతులు, నిబంధనలను ఉల్లంఘించకుండా ఆమోదిత బిల్డింగ్ ప్లాన్‌కు కట్టుబడి నిర్మాణాన్ని పూర్తి చేస్తే, అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేశాక తనఖా పెట్టిన 10 శాతం స్థలానికి విముక్తి కల్పిస్తారు. జీహెచ్ఎంసీతో సహా మున్సిపల్ కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లలోపు స్థలంలో 7 మీటర్లలోపు ఎత్తులో నిర్మించే భవనాలకు, మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల్లో 300 చదరపు మీటర్లలోపు స్థలంలో 7 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు తనఖా నిబంధనల నుంచి మినహాయింపు అమల్లో ఉంది. -
పోలీస్ భవనాలు, టెక్నాలజీకే ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో నూతనంగా నిర్మిస్తున్న కమిషనరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీసీపీల భవనాల కోసం ఈ సారి భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏ విభాగానికి ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలంటూ ఇటీవల ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆయా విభాగాల అధిపతులు సంబంధిత అంశాలతో ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందజేశారు. అందులో భాగంగా రాష్ట్ర పోలీస్ శాఖ బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్ శాఖ ఆధునీకరణలో భాగంగా ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. వాటిలో కింది స్థాయిలో ఉన్న పోలీస్స్టేషన్ల నుంచి హైదరాబాద్‌లోని కమిషనరేట్ వరకు అన్ని ఠాణాల ఆధునీకరణ, టెక్నా లజీ యంత్ర అమలు, ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూములు, అత్యాధునిక వాహనాలు, వినూత్నమైన యాప్స్, సిబ్బందికి వసతి ఏర్పాట్లు వంటి అనేక నూతన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నూతన భవనాల నిర్మాణం ఇంకా పెండింగ్‌లో ఉండటం, కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఈ సారి త్వరితగతిన భవన నిర్మాణాలు వేగవంతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరుతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ సారి కొత్తగా ప్రతీ జిల్లా, కమిషనరేట్‌లో టెక్నాలజీతో కూడిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జెట్ కోరనున్నట్లు తెలిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఏటా ప్రతిపాదించినట్లు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీకి బ్రిటిష్ కమిషనర్ ట్వీట్
హైదరాబాద్: భవన నిర్మాణంలో జరుగుతున్న అంతులేని నిర్లక్ష్యంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ జీహెచ్ఎంసీ అధికారులకు ట్వీట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లో తాను నివసిస్తున్న ప్రాంతంలో గతేడాది కాలం నుంచి నిరంతరాయంగా ఓ భవన నిర్మాణం జరుగుతోందని, రేయింబవళ్లు జరుగుతున్న ఈ నిర్మాణం వల్ల స్థానికంగా శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయని ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఆదివారం కూడా పనులు చేస్తూ నిబంధనలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీకి ఆన్లైన్లో పలుమార్లు తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదన్నారు. తన నివాసం శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడటం లేదని, అయితే చుట్టుపక్కల వారు మాత్రం శబ్ద, వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు మార్బుల్ తీసుకొచ్చే లారీలతోపాటు అన్లోడింగ్ చేసే సిబ్బంది అరుపులు, కేకలు చుట్టుపక్కల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. తాను ఒక హోదాలో ఉన్నాను కాబట్టి ఈ విషయాలు చెప్పగలుగుతున్నానని, ఒక సామాన్యుడు ఎలా చెప్పగలుగుతాడని అన్నారు. అసలు జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుండవా అని నిలదీశారు. ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేయగా.. సాయంత్రం వరకు కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం గమనార్హం. -
కుంగిన బహుళ అంతస్తుల భవనం
కాజీపేట: నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్ భవానీనగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్–4 భవనం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా భూమిలోకి కనిపించకుండాపోయాయి. దీంతో నాలుగంతస్తుల భవనం కాస్తా రెండంతస్తుల భవనంగా మారిపోయింది. వివరాల ప్రకారం...కొత్త రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి జీ ప్లస్–4 పద్ధతిలో కొత్త ఇంటి నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఏడాది నుంచి పనులు కొనసాగుతున్నాయి. కూలీలు మంగళవారం ఉదయం భవనానికి ప్లాస్టరింగ్ పనులు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగానే భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందని మేస్త్రీలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేని వానలు కూడా ఓ కారణమని అంటున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.1.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కదిలి వచ్చిన అధికార యంత్రాంగం... భవనం కుంగిపోయిందనే సమాచారంతో జిల్లా అధికార యంత్రాంగం అరగంటలో భవానీనగర్‌కు చేరుకుని వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు, ఫైర్‌స్టేషన్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐలు శ్రీలక్ష్మి, సంతోష్, అజయ్ పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి స్థానికులెవరినీ భవనం దరిదాపులకు వెళ్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. వాచ్‌మన్ ఆచూకీపై అనుమానాలు... ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న వాచ్‌మన్, ఘటన తర్వాత కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళ కావడంతో కుటుంబంతో ఆ భవనంలో నిద్రిస్తున్నాడా.. లేక బయట ఉన్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఆమ్యామ్యాలు అక్కర్లే!
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ ద్వారానే భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీని అమల్లోకి తెచ్చినప్పటికీ, సంబంధిత ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఆగలేదు. వివిధ కొర్రీలతో అనుమతుల జారీలో జాప్యం చేస్తూ.. చేతులు తడిపితేనే దరఖాస్తులకు అనుమతులిస్తున్నారు. వీటిల్లో నిర్మాణ ప్లాన్‌లో లోపాలు.. షార్ట్‌ఫాల్స్ ఉన్నాయంటూ నిరాకరిస్తున్నారు. లోపాలు సరిదిద్ది తిరిగి రివైజ్ ప్లాన్‌తో దరఖాస్తు చేసుకోమంటున్నారు. జీహెచ్ఎంసీలో ఏటా దాదాపు పదివేల ఇళ్లకు అనుమతులిస్తుండగా, వాటిల్లో దాదాపు మూడువేల దరఖాస్తులిలా ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. తద్వారా ఖర్చులు పెరగడంతో పాటు అనుమతి జారీలో జాప్యం చోటు చేసుకుంటోంది. భవనాలకు 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేయాలనే నిబంధన వచ్చాక ఇలాంటి తిరస్కరణలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి నివారించేందుకు, నిర్మాణదారుల ఇబ్బందులు తప్పించేందుకు ఆటో డీసీఆర్ (ఆటో డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్) ద్వారా దరఖాస్తుకు ముందే ప్లాన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునే ప్రీ స్క్రూటినీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దాని కోసం సంబంధిత కార్యాలయాల దాకా వెళ్లాల్సి వస్తోంది. లేదా ఆర్కిటెక్టులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో చేయి తడిపితేనే పనులవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డీసీఆర్ ద్వారా ప్రీ స్క్రూటినీతో తమ బిల్డింగ్ ప్లాన్ సరిగ్గా ఉందో లేదో ఎక్కడినుంచైనా యజమాని/ఆర్కిటెక్ట్ ఆన్లైన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. నిర్ణీత ఫార్మాట్లో ప్లాన్ నమూనాను సంబంధిత వెబ్సైట్లో అప్‌లోడ్‌చేస్తే.. ప్లాన్ సరిగ్గా ఉన్నదీ లేనిదీ ఆన్లైన్లోనే తెలుస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే ఓకే అని చూపుతుంది. లేని పక్షంలో ఎక్కడ లోపాలున్నాయో తెలుపుతుంది. భవన నిర్మాణానికి సంబంధించి సెట్బ్యాక్లు, ఎత్తు, వెంటిలేషన్ తదితరమైనవి నిబంధనల కనుగుణంగా లేని పక్షంలో ఆ వివరాలు తెలియజేస్తుంది. ఆమేరకు స్క్రూటినీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. తద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ముందే ప్లాన్ సక్రమంగా ఉన్నదీ లేనిదీ స్వీయ పరిశీలనతోనే తెలుసుకోగలుగుతారు. లోపాలుంటే సరిదిద్దుకుంటారు. తద్వారా ఎంతో సమయం, వ్యయం కలిసి వస్తాయి. స్క్రూటినీలో ఓకే అయ్యాక ఇతర సాకులు చూపి, నిర్మాణ అనుమతులు జాప్యం చేసేందుకు అవకాశం ఉండదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండే చర్యల్లో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. సర్కిల్ స్థాయి వరకు అనుమతులిచ్చే నిర్మాణాలకు సైతం ఇది అందుబాటులోకి వస్తుంది. తద్వారా తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఎంతో సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ.. జీహెచ్ఎంసీతోపాటు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, డీటీసీపీల పరిధిలోని భవనాల ప్లాన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. వీటన్నింటికీ హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ ఏర్పాటుకయ్యే వ్యయంలో జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ, డీటీసీపీలు తమవంతు వాటా నిధులు చెల్లిస్తాయని సంబంధిత అధికారి తెలిపారు. జీప్లస్ ఐదంతస్తుల భవనాల ప్లాన్ల వరకు దీన్ని అందుబాటులోకి తేనున్నారు. దాదాపు రెండునెలల్లోగా ఇది అందుబాటులోకి రానుంది. -
నిర్మాణాలకు సిమెంట్ పోటు
పెరిగిన ధరలు.. ఆందోళనలో నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు పాత గుంటూరు: పెరిగిన సిమెంట్ ధరల కారణంగా జిల్లాలో నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. 20 రోజుల వ్యవధిలో సిమెంటు ధర పెరగడంతో భవన నిర్మాణ దారులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలు చేపట్టడం కష్టతరంగా ఉందని వాపోతున్నారు. గతంలో రూ. 320లు ఉన్న సిమెంటు బస్తా ధర, ప్రస్తుతం రూ. 360లకు చేరింది. ఈ ప్రభావం తమను నష్టాలకు గురిచేస్తుందని కాంట్రాక్టర్లు సైతం బెంబేలెత్తుతున్నారు. భవన యజమానులతో తక్కువ ధరకు ఒప్పందాలు కుదుర్చుకొని పెరిగిన సిమెంట్ ధరల కారణంగా నిర్మాణాలు చేయలేక పోతున్నామని అంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా లక్ష టన్నుల వరకు 23 కంపెనీలకు చెందిన సిమెంటు అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు నగరంలో ఉన్న 100 సిమెంటు దుకాణాల ద్వారా 30 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయని సమాచారం. గత ఆరు నెలలుగా సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒకేసారి రూ.40 ధర పెరిగింది. సిమెంట్ ఉత్పత్తి లేదని చెప్పి సంస్థలు సరఫరా నిలిపివేయడంతోనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సిమెంటుకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందని, ప్రస్తుతం వున్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తేనే ఎగుమతి చేస్తామని ఉత్పత్తి సంస్థలు అంటున్నాయని, అయితే అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మకాలు కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం లేదని సిమెంటు డీలర్లు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలు దిగివచ్చేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నష్టాల బాట పడుతున్నాం.. ఉత్పత్తి సంస్థలు సిమెంటు ధరలు పెంచడంతో అమ్మకాలు జరపలేకపోతున్నాం. పాత ధరలకే కొనుగోలు దారులకు సిమెంటును ఇవ్వాల్సి వస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాల బాట పడుతున్నాం. – అబ్దుల్ మదన్, సిమెంటు వ్యాపారి -
భవన నిర్మాణ నిబంధనలు ఇక సరళతరం
రాష్ట్రంలో భవనాల నిబంధనలను సడలించనున్న సర్కారు 200, 300 చదరపు గజాల్లోపు స్థలాలపై మరింత ఊరట నిర్మాణ స్థల విస్తీర్ణం ఆధారంగా ఫీజులు... ఆకాశ హర్మ్యాలకు ప్రోత్సాహం ప్రభుత్వ పరిశీలనలో నూతన భవన నిర్మాణ నియమావళి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానితో పాటు పలు ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇక మరింత ఎత్తయిన భవనాలు కనిపించనున్నాయి. భవన నిర్మాణ నిబంధనలూ సరళతరం కానున్నాయి. సెట్‌బ్యాక్, ‘తనఖా’ తిప్పలూ తప్పనున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్ (భవనం చుట్టూ వదలాల్సిన నిర్ణీత ఖాళీ స్థలం), మార్ట్గేజ్ తదితర అంశాల్లో ఉన్న పరిమితులు, నిబంధనలను ప్రభుత్వం సడలించనుంది. ఈ మేరకు కొత్త భవన నిర్మాణ నియమావళిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ‘హైదరాబాద్ భవన నిర్మాణ నియమావళి-2015’ పేరుతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ముసాయిదా విధానం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉంది. దీనిని సీఎం కేసీఆర్ ఆమోదిస్తే... తొలుత హైదరాబాద్‌లో, తర్వాత రాష్ట్రమంతా అమల్లోకి రానుంది. లక్షల మందికి ప్రయోజనం.. ‘ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నియమావళి’ పేరుతో 2012 ఏప్రిల్‌లో ఉమ్మడి రాష్ట్ర సర్కారు జారీ చేసిన 168 జీవోయే ప్రస్తుతం అమల్లో ఉంది. ఇందులో భవనం ఎత్తు, సెట్‌బ్యాక్, తనఖా (మార్ట్గేజ్) తదితర అంశాలపై కఠిన నిబంధనలు ఉన్నాయి. దీంతో నిర్మాణ అనుమతులు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భవన నిర్మాణాల్లో సడలింపులు ఇవ్వాలని సాధారణ ప్రజలు, బిల్డర్లు కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. ప్రధానంగా 200, 300 చదరపు గజాలలోపు విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో పూర్తిగా సెట్‌బ్యాక్ సడలింపులతో పాటు అదనంగా ఒకటి రెండు అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతించే అంశం పరిశీలనలో ఉంది. ఇది అమల్లోకి వస్తే లక్షల మంది భవన యజమానులకు ప్రయోజనం కలగనుంది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రస్తుతం నివాస, వాణిజ్య భవనాల ఎత్తు 15 మీటర్లకు మించకూడదనే నిబంధన ఉంది. తాజాగా మరో 5 మీటర్ల వరకు ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. తప్పనున్న తనఖా బాధలు భవన నిర్మాణ అనుమతి పొందాలంటే.. 10 శాతం స్థలాన్ని అనుమతులిచ్చే అధికారి పేరు మీద తనఖా రిజిస్ట్రేషన్ చేసే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. ఒకవేళ ప్లాన్‌లో ఉల్లంఘనలు జరిగితే ఈ స్థలాన్ని జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ‘తనఖా’ విషయంలోనూ మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీ నిర్మాణాల బిల్డర్ల నుంచి పర్యావరణ ప్రభావ ఫీజును 4 విడతల్లో వసూలు చేస్తున్నారు. ఇకపై 6 నుంచి 8 విడతలకు పెంచే అవకాశముంది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతి ఫీజులు సైతం భారీగానే ఉన్నాయి. వ్యక్తిగత ఇళ్లకు సైతం వేలలో ఫీజు ఉండడంతో మధ్య తరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి నిర్మాణ స్థలం విస్తీర్ణం ఆధారంగా రాయితీలతో, శ్లాబుల్లో ఫీజులను నిర్ణయించే అవకాశముంది. ఆకాశహర్మ్యాలకు ప్రోత్సాహం హెచ్ఎండీఏ పరిధిలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. సరళీకృత అనుమతులతో పాటు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే విధంగా కొత్త నియమావళిని తీసుకురానుంది. టీఎస్-ఐపాస్ తరహాలో సింగిల్ విండో విధానంలో భవన అనుమతులు జారీ చేయనున్నారు. అనుమతుల్లో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిని ప్రభుత్వం ప్రకటించనుంది. -
నిబంధనలకు పాతర!
తాండూరు: తాండూరులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శిస్తున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల చిన్న పని చేసినా అనుమతులు ఉన్నాయా అని అడిగే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పెద్ద భవన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల అనుమతుల రూపంలో మున్సిపాలిటీకి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. అయినా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులను నిద్ర మత్తు వీడటంలేదు. ‘చేతివాటం’ నేపథ్యంలో కొందరు అధికారులు అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న తాండూరులో ఇటీవల భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తీసుకున్న అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెట్‌బ్యాక్ లేకుండా రోడ్లను ఆక్రమించి, అసలు అనుమతులు లేకుండా పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు కౌన్సిలర్లు తప్పుబడుతున్నారు. అప్పుడప్పుడు పేరుకు కొందరికి నోటీసులు జారీచేసి, కోర్టులో కేసులు వేశామని చెప్పి అధికారులు మమ అనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీయల్ ఏరియా అయిన గ్రీన్ సిటీలో అక్రమ నిర్మాణాలు అధికంగా జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర విహ ంచడాన్ని మున్సిపల్ కౌన్సిలర్ సరితాగౌడ్ తప్పుబడుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. సాయిపూర్, శాంతినగర్, చించొళి మార్గం.. ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని, అక్రమ నిర్మాణాలు కొన్ని ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ కౌన్సిలర్ నర్సిం హులు విమర్శిస్తున్నారు. ఈవిషయంలో తాము సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టౌన్ పాన్లింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని కౌన్సిలర్ సుమిత్‌కుమార్‌గౌడ్ విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం రాకుండా చేస్తున్న అధికారులను నిలదీస్తామని వారు పేర్కొన్నారు. పాలకమండలి చొరవ చూపితే అక్రమ నిర్మాణాలకు కొంతవరకైనా అడ్డుకట్టపడి మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తాండూరు టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మీపతి చెప్పారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఎల్ఆర్ఎస్ లేకున్నా.. భవన నిర్మాణాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: అనధికార లే-అవుట్లలో ప్లాట్లు కొనడం వల్ల భవన నిర్మాణాలకు అనుమతి రావడం లేదని మీరిక బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు కొన్న ప్లాట్లు 2008 జనవరి కంటే ముందు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అప్పుడు అపరాధ రుసుము వసూలు చేసుకుని ఇంటి నిర్మాణాలకు అనుమతించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతోపాటు పట్టణాభివృద్ది సంస్థలకు సర్క్యులర్ రూపంలో అధికారులు సమాచారం అందించారు. అనధికార లేఅవుట్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇదివరకు ఇచ్చిన గడువు ముగియడంతో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీనితో ప్లాట్లు కొన్నా.. వాటికి అనుమతులు రాని పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే.. ఖాళీ ప్రదేశ రుసుము(ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్)ను దరఖాస్తు చేసుకున్న తేదీన రిజిస్ట్రేషన్ విలువలో 14 శాతం జరిమానాను, అలాగే ప్లాటు క్రమబద్ధీకరణ కింద అపరాధ రుసుము 14 శాతంతోపాటు భవన నిర్మాణ అనుమతికి సంబంధించి చార్జీలు చెల్లించిన పక్షంలో వారిని నిర్మాణానికి అనుమతించనున్నారు. అయితే ఇదంతా 2008 జనవరికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు అందులో స్పష్టం చేశారు. 2008 జన వరి తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2008 జనవరి తరువాత ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు ఇళ్ల నిర్మాణం చేయడానికి వీలుగా నాలుగైదు సూచనలతో అధికారులు ప్రభుత్వానికి సిఫారసులు చేశారు. కాని వాటిపై దృష్టి పెట్టేందుకు పాలకులకు సమయం చిక్కడం లేదు. ఒక లేవుట్లోని క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల యజమానులంతా కలిసి తిరిగి లేఅవుట్ రూపొందించుకుని, నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాలకు 10 శాతం, రహదారుల కోసం 30 శాతం స్థలాన్ని వదిలేసి తిరిగి లే అవుట్ చేసుకుని అన్ని రకాల చార్జీలు చెల్లిస్తే కొత్త లే అవుట్ మంజూరు చేయాలని, లేని పక్షంలో అనధికార లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిబంధన విధించాలని, మరోసారి కటాఫ్ డేట్ విధించి తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని కూడా అనుమతించాలని నివేదించారు. ప్రభుత్వం దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి.