సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై ఏ అంతస్తులోనైనా 10 శాతం నిర్మిత స్థలాన్ని అనుమతులు జారీ చేసే విభాగానికి తనఖా పెట్టవచ్చు. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం... నిర్మించనున్న భవనంలోని గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లలో 10% నిర్మిత ప్రాంతాన్ని అను మతులు జారీ చేసే ప్రభుత్వ యం త్రాంగం (పురపాలిక) పేరుతో తనఖా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాల్లో లేదా పాత భవనాలను కూల్చి వేసి ఆ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి ఆయా స్థలాల యజమానులతో డెవలపర్లు ఒప్పందం చేసుకుంటుంటారు. ఈ ఒప్పందాల్లో భూయజమానికి, డెవలపర్ల మధ్య స్పష్టమైన వాటాలను నిర్దేశించుకుంటారు.
గ్రౌండ్ ఫ్లోర్/ ఫస్ట్ ఫ్లోర్/ సెకండ్ ఫ్లోర్‌లలోని ఫ్లాట్లను తమ వాటా కింద భూయజమానులు తీసుకున్న సందర్భాల్లో వాటిని తనఖా పెట్టడానికి విముఖత చూపుతుండటంతో భవన అనుమతులు పొందడానికి డెవలపర్లు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డెవలపర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నిర్మించనున్న భవనంలోని ఏ అంతస్తులోనైనా 10శాతం నిర్మిత ప్రాంతాన్ని తనఖా పెట్టడానికి అనుమతిస్తూ భవన నిబంధనలకు ప్రభుత్వం కీలక సవరణలు జరిపింది. అనుమతులు, నిబంధనలను ఉల్లంఘించకుండా ఆమోదిత బిల్డింగ్ ప్లాన్‌కు కట్టుబడి నిర్మాణాన్ని పూర్తి చేస్తే, అక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేశాక తనఖా పెట్టిన 10 శాతం స్థలానికి విముక్తి కల్పిస్తారు. జీహెచ్‌ఎంసీతో సహా మున్సిపల్ కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లలోపు స్థలంలో 7 మీటర్లలోపు ఎత్తులో నిర్మించే భవనాలకు, మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల్లో 300 చదరపు మీటర్లలోపు స్థలంలో 7 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు తనఖా నిబంధనల నుంచి మినహాయింపు అమల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment