సాక్షి, మంచిర్యాల: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి వేళ్లూనుకుపోయింది. ఏ కార్యాలయంలోనైనా మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే రోజువారీ పనులు జరుగుతాయనేది బహిరంగ సత్యం. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారి నుంచి డాక్యుమెంట్‌కు ఓ ధర నిర్ణయించి మధ్యవర్తులు చేసిన వసూళ్లు అధికారులకు ముడుతున్నాయి. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా సిటిజన్ చార్ట్ పూర్తిగా అమలు కావడం లేదు. దీంతో డిమాండ్ ఉన్న చోట పోస్టింగ్ కోసం ఉమ్మడి జిల్లాలో తమకు కావాల్సిన చోటుకి డిప్యూటేషన్ల పేరుతో బదిలీ అవుతూ తతంగం నడిపిస్తున్నారు.
గతంలో ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఉన్నతాధికారులు మాత్రం వారినే తిరిగి కోరిన చోటుకు బదిలీ చేస్తుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, భైంసా, నిర్మల్, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి ఉమ్మడి జిల్లా కేంద్రంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. విధి నిర్వాహాణలో అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి కేసుల్లో సబ్ రిజిస్ట్రార్లపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడి ఏసీబీకి పట్టుబడిన వారు ఉన్నారు.
సస్పెన్షన్లు, ఏసీబీ కేసులు..
ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 2014 నుంచి 2019వరకు జరిగిన స్టాంపుల కుంభకోణంలో రూ.80లక్షలకు అక్రమాలు జరిగాయి. ఇందుకు కారణమైన మొత్తం 12మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక ఏళ్లకేళ్లుగా రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు లేకపోవడం, బదిలీలు జరిగినా.. డిప్యూటేషన్లతో ఉమ్మడి జిల్లాలోనే ఏదో ఒక కార్యాలయానికి బదిలీపై వెళ్లడం సర్వసాధారణమైపోయింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి బదిలీలు జరగాలి. ఐదేళ్లు, పదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారి ఒక్కరు కూడా ఉమ్మడి జిల్లాలో లేకపోవడం గమనర్హం.
- ఆసిఫాబాద్ ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సాయి వివేక్ గతంలో ఆదిలాబాద్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయనే ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందు విజయకాంత్‌రావు తొమ్మిదేళ్లకు పైగా ఇక్కడ పని చేశారు. ఆయన డిప్యూటేషన్‌పై ప్రస్తుతం నిర్మల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
- భైంసా సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న రామ్‌రాజ్‌పై అక్రమ భూముల రిజిస్ట్రేషన్లపై పలు ఆరోపణలు రావడంతో ఆయనను ఇటీవల ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మీకి ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు.
- లక్సెట్టిపేట సబ్ రిజిస్ట్రార్ ఇక్బాల్ సెలవుల్లో ఉండగా ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా రతన్ విధుల్లో చేరారు. గత నెల 11న ఒకే రోజు ఈయన 39 రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాస్పదమైంది. రియల్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చని ఫిర్యాదులు రావడంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో శేఖర్ విధులు నిర్వహిస్తున్నారు.
- మంచిర్యాల జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న అప్పారావు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భూమి రిజిస్ట్రేషన్ చేశారనే ఫిర్యాదుతో సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న మురళీని ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించారు. మురళీపై కూడా అవినీతి కేసులో ఏసీబీ విచారణ సాగుతోంది.
- ఖానాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి గతంలో నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కొ న్నాళ్లకు ఆయనే ఖానాపూర్ సబ్‌రిజిస్ట్రార్‌గా వ చ్చారు. గత మూడేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు.
- అంతకు ముందు కూడా ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఓ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా ఫిర్యాదులు వచ్చాయి.
చదవండి: ఇక్కడ నుంచి కదలరు.. ఎస్సై, సీఐ, ఏసీపీ.. ఏ ప్రమోషన్ వచ్చినా..
Comments
Please login to add a commentAdd a comment