సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ పథకం రద్దుపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఆందోళన విరమించబోమని సైనిక ఉద్యోగ అభ్యర్థులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన కొనసాగిస్తున్న యువకులను సముదాయించేందుకు పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం మధ్యాహ్నం ప్రయత్నించారు. 10 మంది చర్చలకు రావాలని కోరగా.. ఆందోళనకారులు నిరాకరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులపై యువకులు శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే సైనిక ఉద్యోగ నియామకాలు జరపాలన్న ఏకైక డిమాండ్‌పై గట్టిగా నిలబడ్డారు.
► మేము చేస్తున్న డిమాండ్లు మీ పరిధిలో లేవు.. అలాంటపుడు మీతో చర్చలు జరిపి ప్రయోజనం ఏంటి?
► శాంతియుతంగా ఆందోళన చేపట్టిన మాపై లాఠిచార్జి చేసి, ఎందుకు కాల్పులు జరిపారు?
► మాకు ఉద్యోగాలు వస్తే మేము కూడా సైనికులమే, అలాంటి మాపై కాల్పులు జరుపుతారా?
► మమ్మలందరినీ ఏఆర్వో దగ్గరికి తీసుకెళ్లలేమని పోలీసులు చెబుతున్నారు.. అలాంటప్పుడు ఏఆర్వోనే మా దగ్గరకు రావొచ్చు కదా!
► అగ్నిపథ్ పథకం దేశానికి సంబంధించిన అంశం.. కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే ఆందోళన విరమిస్తాం.
► చావడానికి సిద్ధపడే వచ్చాం.. కేంద్రం మాకు స్పష్టమైన హామీయిచ్చే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం.
► మేము చేసిన ఆందోళనలో ఒక్క ప్రయాణికుడు కూడా గాయపడలేదు. కానీ పోలీసులు జరిపిన కాల్పుల్లో మా వాళ్లు చాలా మంది గాయపడ్డారు.
► పోలీసులు అరెస్ట్ చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలి. వాళ్ల ప్రాణాలకు ఏదైనా అయితే పోలీసులదే బాధ్యత.
Comments
Please login to add a commentAdd a comment