![The aim is to provide safe drinking water to every household](/styles/webp/s3/article_images/2024/07/7/sitakka.jpg.webp?itok=MlBtcQmJ)
ఆవాస గ్రామాలకూ మిషన్ భగీరథ చేరాలి
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఆవాస గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరే షన్‌తో అన్ని ఆవాసాలను అనుసంధానించాలని సూచించారు. కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు అందని గ్రామాలను గుర్తించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు.
శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో అధికారులు మిషన్ భగీరథ పథకంపై అధికారులు ఆడిట్ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అటవీ ఆవాస గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, తెలంగాణ రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment