సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో సంస్కరణల వేగానికి, నష్టాల బ్రేక్‌కు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. అసలే నష్టాలు, ఆపై కోవిడ్ దెబ్బ.. ఫలితంగా కుదేలైన ప్రగతిచక్రాన్ని గాడిలో పెట్టేందుకు సంస్థ దిద్దుబాటు మొదలుపెట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో సంస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు కారణాలు, సంస్కరణల ఆవశ్యకతపై అధ్యయనం చేసేందుకు ఆర్టీసీలో కొత్తగా ట్రాఫిక్ అనాలిసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. కొందరు సీనియర్ అధికారుల నేతృత్వంలో ఆ విభాగం పని ప్రారంభించనుంది.
రద్దీ ఉన్న వైపే దృష్టి..
ఆర్టీసీకి కొన్నేళ్లుగా రికార్డుస్థాయిలో నష్టాలొస్తుండగా, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం మంచి ఆదాయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ తరహాలోనే చాలా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. మరి ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆదాయం వస్తుండగా, ఆర్టీసీ ఎందుకు నష్టాలను మూటగట్టుకుంటోందనే కోణంలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రైవేటు ట్రావెల్స్ ఏయే రూట్లలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి, ఏయే ప్రాంతాలవైపు వాటికి రద్దీ అధికంగా ఉంటోంది, ఆర్టీసీని కాదని ప్రయాణికులు ఎందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.. అనే కోణాల్లో ఈ విభాగం వివరాలు సేకరిస్తుంది.
వివిధ కేటగిరీ బస్సుల్లో వేటికి ఎక్కువ ఆదాయం వస్తోంది.. వేటివైపు ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు, ఏయే మార్గాల్లో ఎక్కువ రద్దీ ఉంటోంది.. ఏయే సమయాల్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి.. తదితర వివరాలను కూడా సేకరించనుంది. తర్వాత ఆర్టీసీకి–ప్రైవేటు ట్రావెల్స్‌కు మధ్య ఉన్న తేడాలను అధికారులు గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సుల ఆదాయాలు, ఆక్యుపెన్సీ రేషియో, బస్సుల నిర్వహణ, రద్దీ ఉన్న రూట్లు.. తదితర వివరాలను రాబట్టి విశ్లేషించనుంది. తెలంగాణ ఆర్టీసీ– వేరే రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పోలికలు, వ్యత్యాసాలను కూడా బేరీజు వేయనుంది. వెరసి డిమాండ్ ఉన్న కేటగిరీ బస్సులు, రద్దీ ఉన్న మార్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆర్టీసీ నిర్ణయాలు తీసుకునుంది.
విస్తరించటంతో నష్టమా..
ప్రాంతాలు విస్తరించేకొద్దీ, జనాభా పెరిగే కొద్దీ ఆర్టీసీ సేవలను కూడా విస్తరించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజారవాణా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ విస్తరణ శాస్త్రీయంగా ఉండాలి. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన కసరత్తు చేయకుండా అశాస్త్రీయంగా విస్తరిస్తూ వస్తున్నారు. ఇది ఆర్టీసీకి నష్టాలు తెచ్చిపెడుతోంది. కొందరు డిపో మేనేజర్లు రూట్ స్టడీలు పక్కాగా నిర్వహిస్తుండటంతో ఆయా డిపోల్లో ఆదాయం మెరుగ్గా ఉంటోంది. ఇప్పుడు విస్తరణ కంటే, ఉన్నఫళంగా నష్టాలను తగ్గించేందుకే ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. తాజా కసరత్తు కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment