గత బడ్జెట్‌లో రూ.1,101కోట్లు.. ఇప్పుడు రూ.1,065 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రెండ్రోజుల క్రితమే ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీని పెంచారు. కొత్తగా మరికొన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఆరోగ్యశ్రీకి నిధులను తగ్గించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతఏడాది బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.1,101 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.1,065 కోట్లకు పరిమితం చేశారు. వాస్తవంగా చికిత్సల ప్యాకేజీ, కవరేజీ పెంపుతో అధికంగా నిధులు కేటాయించాల్సి ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక మొత్తంగా వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గాయి.
ఈ బడ్జెట్‌లో వైద్యరంగానికి ప్రభుత్వం రూ.11,468 కోట్లు కేటాయించింది. గత ఏడాది బీఆర్‌ఎస్ సర్కారు వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్లో రూ.12,161 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ శాఖ కేటాయింపులు రూ.693 కోట్లు తగ్గాయి. కాగా బడ్జెట్‌లో నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కాలేజీల నిర్మాణం కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
మెడికల్ కాలేజీలకు రూ.542 కోట్లు..
మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ.542 కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.260 కోట్లు, బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్స్, పరికరాల కోసం రూ.360 కోట్లు కేటాయించారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల అప్‌గ్రేడింగ్ కోసం రూ.249 కోట్లు, ఆయా ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.115 కోట్లు కేటాయించారు. అలాగే ఈ ఆస్పత్రుల్లో శానిటరీ, రోగుల సేవలకు మరో రూ.114 కోట్లు కేటాయించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం కోసం రూ. 51 కోట్లు, అమ్మఒడి కోసం రూ. 141 కోట్లు, 102 వాహనాల కోసం రూ. 17.62 కోట్లు, 108 కోసం రూ.19.53 కోట్లు, 104కు రూ.21 కోట్లు ఇచ్చారు. నిమ్స్‌లో అత్యవసర వైద్య పరికరాల కోసం రూ.49 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలోనే ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
దీనికోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించింది. అలాగే ప్రగతి పద్దులో వైద్యవిద్య సంచాలకులకు రూ.2,656 కోట్లు, ప్రజారోగ్య సంచాలకులకు రూ.558 కోట్లు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి రూ.1,762 కోట్లు, ఆయుష్‌కు రూ.117 కోట్లు, ఔషధాల కొనుగోళ్ల కోసం రూ. 377 కోట్లు, మాతాశిశు సంరక్షణ కిట్ (ఎంసీహెచ్– గతంలో కేసీఆర్ కిట్)కు రూ. 200 కోట్లు కేటాయించారు.
ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత హోదాలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేసీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు. సాధారణ ఎమ్మెల్యేలు వచ్చే రెండో నంబర్ గేట్ నుంచి అసెంబ్లీకి వచ్చిన ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా తనకు కేటాయించిన చాంబర్‌లోకి వెళ్లారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
శాసనసభలోకి వెళ్లిన కేసీఆర్ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అభివాదం చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన సీటులో కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. సభలో అప్పటికే భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం సాగుతుండగా, కేసీఆర్ ఆసక్తిగా వింటూ పాయింట్స్ నోట్ చేసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అంశంపై బడ్జెట్ ప్రసంగం సాగుతున్న సమయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావును పిలిచి చర్చించడం కనిపించింది. భట్టి బడ్జెట్ ప్రసంగం పూర్తికాకముందే కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ హాలు నుంచి బయటకు వచ్చారు.
మీడియాపాయింట్ ఎక్కడ అని ఎమ్మెల్యేలను అడిగారు. నేరుగా మీడియా పాయింట్‌కు చేరుకొని ఎమ్మెల్యేలతో కలిసి బడ్జెట్‌పై తన అభిప్రాయం తెలియజేశారు. కాగా 20ఏళ్ల తర్వాత కేసీఆర్ మీడియా పాయింట్ నుంచి మాట్లాడడం ఇదే తొలిసారి అని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానించారు. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అప్పట్లో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన రేగులపాటి పాపారావుతో కలిసి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన విషయాలను వారు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment