బాల కళాకారునిగా మొదలై రచయితగా..
సినిమా రంగంలోనూ అడుగుపెట్టి
వరించిన పలు అవార్డులు, పురస్కారాలు
భాగ్యనగరంలో స్థిరపడిన పసునూరి రవీందర్, ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లాలో కూలి పనులు చేసుకొని బతికే వరమ్మ, వీరస్వామి దంపతుల మొదటి సంతానం. చిన్ననాటి నుంచి చదువే లోకంగా ఎదిగి, విద్యార్థి సంçఘాల్లో నాయకునిగా, గాయకునిగా పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో గోల్డ్ మెడల్ సాధించాడు.
అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్య విమర్శ అన్న అంశంపై ఎంఫిల్, తెలంగాణ ఉద్యమపాట– ప్రాదేశిక విమర్శ అన్న అంశంపై పీహెచ్‌డీ, అలాగే పీహెచ్‌డీ అనంతరం పరిశోధనలో భాగంగా అస్తిత్వ ఉద్యమాల సాహిత్య విమర్శపై పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. డాక్టరేట్ పట్టాను అందుకున్న పసునూరి సాహిత్య కృషి కూడా ఎంతో స్ఫూర్తివంతమైంది.
పసునూరి రచనలు..
లడాయి (ధీర్ఘ కవిత), అవుటాఫ్ కవరేజ్ ఏరియా (తెలంగాణ దళిత కథా సంపుటి), తెలంగాణ ఉద్యమ పాట–ప్రాదేశిక విమర్శ(పరిశోధన గ్రంథం), ఇమ్మతి (సాహిత్య విమర్శ వ్యాసాలు), గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ(పరిశోధన గ్రంథం), ఒంటరి యుద్ధభూమి (కవిత్వం), పొటెత్తిన పాట (పాటకవులపై వ్యాసాలు), కండీషన్స్ అప్లయ్ (కథా సంపుటి).
కేంద్ర సాహిత్య అకాడమీ యువ తొలి పురస్కార గ్రహిత..
కొంతమందికి అవార్డుల ద్వారా పేరొస్తుంది. మరికొందరి వల్ల అవార్డులకే పేరొస్తుంది.. ఈ రెండో కోవకి చెందిన వారే యువ రచయిత డాక్టర్ పసునూరి రవీందర్. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలంగాణ రచయిత. అప్పటి వరకూ ఇలాంటి ఓ అవార్డు ఉందన్న విషయం సాహితీలోకంలో చాలా మందికి పెద్దగా తెలియదు. కవిగా, రచయితగా, విమర్శకునిగా, వాగ్గేయకారునిగా, వక్తగా, సామాజిక ఉద్యమకారునిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కృషి అతడి సొంతం. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా సాహిత్యానికి అంకితమై సాగుతున్న పసునూరి రవీందర్ స్ఫూర్తి కథనం ‘సాక్షి’ పాఠకుల కోసం...
– సుందరయ్య విజ్ఞాన కేంద్రం
బాల కళాకారునిగా..
మొదట బాల కళాకారునిగా పాటతో మొదలైన తన పయనం, అనతికాలంలోనే కవిత్వం మీదికి మళ్లింది. ఆ తరువాత కథల్లోకి చేరింది. అలా తాను రాసిన కథలను అవుటాఫ్ కవరేజ్ ఏరియా పేరుతో పుస్తకంగా ప్రచురించాడు. ఈ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. తాను తెలంగాణ పాటపై చేసిన పరిశోధనకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్ వారితో సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం లభించింది. ఇక సాహిత్య విమర్శపై మక్కువతో తాను రాసిన వ్యాసాలను కలిపి ఇమ్మతి, గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ, పొటెత్తిన పాట వంటి పుస్తకాలను ప్రచురించారు.
సినిమా రంగంలోనూ..
ఇటీవల సినిమా రంగంలోనూ అడుగుపెట్టిన పసునూరి ప్రముఖ నిర్మాత రాఘవేందర్‌రావు సారథ్యంలో వచి్చన సర్కార్ నౌకరోడు సినిమాలో చక్కని పాట రాశాడు. అలాగే అక్షర కుమార్ డైరెక్షన్‌లో వచి్చన షరత్తులు వర్తిస్థాయి సినిమాలోనూ మరో
పాటను అందించాడు.
అవార్డులు, పురస్కారాలు..
– కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం (2015).
– సురవరం ప్రతాపరెడ్డి అవార్డు (2015).
– తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2020)
– తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ గ్రంథ అవార్డు (2024)
– భారతీయ దళిత సాహిత్య అకాడామీ సాహిత్య రత్న (2018)
– గూడ అంజయ్య స్మారక పురస్కారం (2019).
– సుద్దాల హన్మంతు పురస్కారం (2019).
– నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా పురస్కారం (2015)
– గిడుగు పురస్కారం (2017)
– కాళోజీ జాతీయ పురస్కారం (2020)లతో పాటు సుమారు 25పైగా అవార్డులు, పురస్కారాలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment