సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అధికార టీఆర్‌ఎస్ కుటిల యత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం ఇతర పార్టీలతో జట్టు కడుతోంది. అయినా మేం తెలంగాణలో పాగా వేసి తీరుతాం. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినా తెలంగాణ అభివృద్ధి చెందలేదు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ప్రజలారా ఇదే చివరి యుద్ధం కావాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం మంథన్‌గోడ్ నుంచి ప్రారంభమైన బండి పాదయాత్ర దండు మీదుగా నెహ్రూగంజ్‌కు చేరుకుంది.
మక్తల్ మార్కెట్ యార్డులో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ‘బీజేపీని ఎదుర్కోలేకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ 31 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు ఇవ్వబోతోంది. కేసీఆర్‌తో పీకే మంతనాల వెనుక మతలబు ఇదే. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే. కాంగ్రెస్‌లో గెలిచేటోడు అమ్ముడుపోతాడు.. ఓడిపోతే పార్టీనే అమ్మేస్తాడు. పాతబస్తీ మాదే.. యావత్ తెలంగాణ మాదే’అని బండి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేయలేదని, పొత్తు పెట్టుకోలేదని బండి గుర్తుచేశారు.
బీజేపీ చేసిన ఉద్యమంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చారని, ధర్నాచౌక్‌ను తెరిచారని బండి పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రమే టీఆర్‌ఎస్‌ది అని.. స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతుల్లో ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు.. ఉపఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచాక కేసీఆర్‌కు భయం మొదలైందన్నారు. కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
యథావిధిగా పాదయాత్ర..
బండి పాదయాత్రపై సోమ వారం గందరగోళం చోటుచేసు కుంది. సంజయ్ ఆదివారం అస్వస్థతకు గురవడంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో యాత్రను 2 రోజుల పాటు బండి వాయిదా వేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలిపారు. అయితే కాసేపటికే యాత్ర యథావిధిగా కొనసాగుతుందని ఆమె పేరిట ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment