సబ్సిడీ కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేసిన బీసీ కార్పొరేషన్
రూ.2,100 కోట్లతో ప్రతిపాదనలు.. సీఎం సూత్రప్రాయ అంగీకారం
ఎంబీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనూ పథకాల అమలు
మార్చి చివరికల్లా యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యంగా కార్యాచరణ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేగంగా అడుగులు
త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ బీసీ కార్పొరేషన్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,100 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దీనిపై ప్రత్యేకంగా చర్చించి సూత్రప్రాయంగా ఆమోదించినట్టు తెలిసింది.
ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉత్తర్వులు రాగానే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు బీసీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది.
ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
దశాబ్దకాలం నుంచీ నిరీక్షణే..
తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కల్పన చాలా ఏళ్లుగా అటకెక్కింది. దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతూ వచ్చినా, విడుదల చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో బీసీ సబ్సిడీ రుణాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించారు. అప్పుడు దాదాపు 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ మంజూరు కాలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.50వేల లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరికి మంజూరు చేసినా.. తర్వాత రుణాల పంపిణీ ఊసేలేదు. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్వయం ఉపాధి పథకాలను పట్టాలెక్కించాలని నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికల ముందు..
త్వరలో రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సబ్సిడీ పథకాలను తెరపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీసీ కార్పొరేషన్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.
ఇక ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా కూడా సబ్సిడీ పథకా లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంబీసీ కార్పొరేషన్ అధికారులకు సైతం పలు సూచనలు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వారంలో వెలువడే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment