మానకొండూర్ రూరల్: జనారణ్యంలోకి చొరబడిన ఎలుగుబంటి ఎనిమిది గంటలు హైరానా చేసి ఎట్టకేలకు బోనులో చిక్కింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లోని చెరువుకట్ట సమీపంలో కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూరేందుకు యత్నించింది. కుక్కలు అరవడంతో ఇంటి పక్కనున్న వేపచెట్టు ఎక్కింది. ఇంటి యజమాని ఉదయం ఎలుగుబంటి అరుపులు విని, భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు ఎలుగుబంటి ఉన్న ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెటర్నరీ వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గ్రామస్తుల సందడితో ఎలుగుబంటి చెట్టుదిగి చెరువు పక్కనున్న పొదల్లోకి దూరింది. పొదల్లో ఎలుగుబంటి కనిపించడంతో టపాసులు పేల్చి బయటకు రప్పించారు.
అక్కడి నుంచి అది పంటపొలాల వెంట పరుగెత్తి సమీప ముంజంపల్లి గ్రామం వైపు వెళ్లింది. అటవీ అధికారులు మత్తు ఇంజక్షన్‌ను ఫైర్ చేయడంతో కిలోమీటర్ దూరం పరుగెత్తి పొలాల్లో సొమ్మసిల్లి పడిపోయింది. స్పృహ తప్పిన ఎలుగుబంటిని వలలో బంధించి వ్యాన్‌లో ఎక్కించి వరంగల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment