సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘‘కొందరు దేశాన్ని కులం మతం పేరిట విడదీస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చైనా, సింగపూర్, కొరియా దేశాల్లోలాగా కుల మత రహిత దేశంగా ముందుకు సాగాలి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో నిర్మించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: దేశంలో అనేక నదులు, ఎంతో సంపద ఉండి కూడా అభివృద్ధి చెందలేకపోయింది. దేశాన్ని ఏలుతున్న పాలకుల వైఫల్యాలే దీనికి కారణం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసం ఉంది. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే పార్టీల పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పార్టీల మాటలకు మోసపోతే గోస పడతాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో గత పాలకుల చేతకానితనం, అసమర్థత వల్ల అభివృద్ధికి దూరమయ్యాం. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నేటికీ తీవ్రంగా కరెంట్ కోతలు ఉన్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, కోతల్లేని 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను చూసి నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను చూసి తమ రాష్ట్రంలోనూ ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండేదని ఇతర రాష్ట్రాల ప్రజలు అంటున్నారు.
తలసరి ఆదాయం పెరిగింది
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2014లో దాదాపు రూ.లక్ష తలసరి ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.2,78,500కు పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని నేను ఉద్యమకాలంలోనే చెప్పిన. అదిప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఇవాళ రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11.50 లక్షల కోట్లకు పెరిగి దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది ఆషామాషీగా ఏమీ జరగలేదు. కడుపు కట్టుకొని పనిచేయడం, అవినీతి రహిత పాలన అందించడం వల్లే సాధ్యమైంది.
రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను 6 నెలల వ్యవధిలోనే నిర్మించుకోవడం, 11 వేల క్రీడా ప్రాంగణాలనూ అనతి కాలంలోనే ఏర్పాటు చేసుకోవడం సుపరిపాలనతోనే సాధ్యమైంది. పరిపాలన ప్రజలకు ఎంత చేరువగా ఉంటే అంత చక్కగా పనులు జరుగుతాయి. అందుకే 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని, నూతన కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నాం.
సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉన్నాం
దేశంలో సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న 36 లక్షల పింఛన్లకు అదనంగా మరో 10 లక్షలు కలిపి మొత్తం 46 లక్షల పింఛన్లు అందిస్తున్నాం. ఇవి ఎప్పుడో అందించాల్సింది. కానీ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. త్వరలోనే వారందరికీ డిజిటల్ కార్డులు జారీ చేస్తాం. గతంలో వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పరిస్థితి కనిపించేది. కానీ ఆసరా పింఛన్ల పుణ్యామా అని అత్త, అమ్మలకు డిమాండ్ పెరిగింది. ఇవాళ రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వారి సంచిలో ఉంటుండటంతో ఎవరికీ భారం కాకుండా బతుకున్నారు. అందుకు కారణం తమ పెద్ద కొడుకు కేసీఆరేనని భావిస్తున్నారు. త్వరలో డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తాం.
దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటిలో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. కరోనా కారణంగా మరికొన్నింటిని ప్రారంభించలేకపోయాం. గతంలో తెలంగాణ జనం పస్తులు ఉండలేక దుబాయ్, బొంబాయిలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 13 లక్షల మందికిపైగా తెలంగాణకు వలస వచ్చి జీవిస్తున్నారు.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దేశంలో పరిణామాలను గమనించాలి
60ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58ఏళ్ల పాటు ఎన్నో గోసలు పడ్డాం. ఇప్పుడు పూర్తి జాగ్రత్తతో ఉండాలి. దేశంలో జరిగే పరిణామాలను గమనించాలి. పత్రికల్లో వచ్చే వార్తలను చూసి వదిలేయకుండా వాటిపై గ్రామాల్లో, బస్తీల్లో సైతం చర్చ జరగాలి. అప్పుడే చైతన్యవంతమైన సమాజ పురోగతి సాధ్యమవుతుంది.
మేడ్చల్ అభివృద్ధికి రూ.70 కోట్లు
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా చాలా భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నా.. మిగతా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ నిధులు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు తనకు విన్నవించారని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనితో అదనంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 7 నియోజకవర్గాలకు రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై గురువారమే జీవో జారీ చేస్తామన్నారు. కాగా.. సభకు ముందు కొత్త కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, భవన సముదాయాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద, కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు
Comments
Please login to add a commentAdd a comment