సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్ తెలంగాణ–2023’కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలిచి కాషాయజెండా ఎగురవేసి తీరాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నిర్దేశిత లక్ష్యసాధన దిశగా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వే బృందాలతో నివేదికలు తెప్పించుకుంటూ వ్యూహాల అమలు బాధ్యతను, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనాయకులకు రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అప్పజెప్పింది.
సర్వేలు..స్వయం పరిశీలనలు
కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో పార్టీ విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. దక్షిణాదిలో అధికార విస్తరణకు రాష్ట్రం కీలకమనే అంచనాల నేపథ్యంలో తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ వాస్తవ పరిస్థితి, క్షేత్రస్థాయిలో బలం, సంస్థాగతంగా పటిష్టతతో పాటు టీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రభావం చూపే రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు, నియోజకవర్గాల వారీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది.
నియోజకవర్గాల్లో గ్రామస్థాయి వరకు ఉన్న రాజకీయ పరిస్థితులపై పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర సంస్థలు, పరిశోధక, అధ్యయన బృందాల ద్వారా సర్వేలు నిర్వహిస్తోంది. ఒకరకంగా పార్టీకి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఇందుకోసం పనిచేస్తోంది.
మరోమారు ముఖ్య నేతల రాక
తెలంగాణలోని 119 అసెంబ్లీ నిÄయోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్య నేతలు రెండోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇటీవలే షాద్‌నగర్‌లో కేంద్రమంత్రి ఆర్‌పీ సింగ్, మహేశ్వరం నియోజకవర్గంలో మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి పర్యటించారు. త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాలకు కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఓ దఫా పరిశీలన
గత జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. బీజేపీకి చెందిన అతిరథ మహారథులు ‘ప్రవాసీ యోజన’పేరిట చలో తెలంగాణ అంటూ మూడురోజుల పాటు 119 నియోజకవర్గాల్లో పర్యటించారు. దాదాపు 25 రాష్ట్రాలకు చెందిన ఈ నేతల జాబితాలో ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులు, పలువురు కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ముఖ్యనేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు తాము బస చేసిన కార్యకర్తల ఇళ్లలోనే భోజనాలు చేయడం ద్వారా వారికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, టీఆర్‌ఎస్ తీరు, అక్కడున్న సమస్యలను పరిశీలించారు. ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో వివిధ స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చాలతో సమావేశమై స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలను కలుసుకుని ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, పేదలకు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.
నాయకత్వానికి ప్రాథమిక నివేదికలు
ఈ నేతలందరూ తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోని పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి ప్రాథమిక నివేదికలు సమర్పించారు. ఆ స్థానాల్లో పార్టీపరంగా పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో రెండో విడత ‘ప్రవాసీ యోజన’కు కేంద్రమంత్రులు సిద్ధమౌతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ విధంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేరుగా అమిత్ షాకే రిపోర్ట్
అమిత్ షా ప్రత్యక్ష పర్యవేక్షణలో, నేరుగా ఆయన కార్యాలయానికే రిపోర్ట్ చేసేలా ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’అనే సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గత కొంతకాలంగా హైదరాబాద్ నుంచి పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, టీఆర్‌ఎస్ లోపాలు, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నారు.
మరోవైపు ఎన్నికల సంబంధిత వ్యవహారాల్లో నిపుణులు, గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పనిచేసిన వారిని ప్రత్యేకంగా నియమించారు. గత లోక్‌సభ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలతో పాటు, యూపీ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేసిన వివిధ బృందాల్లో కొన్ని ఇప్పటికే తెలంగాణలో పనిచేయడం ప్రారంభించాయి. యూపీ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో క్రియాశీలంగా పనిచేసి మంచి ఫలితాలను సాధించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జిగా నియమించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment