నఖ్వీ, కిరణ్ రిజిజు , దేవేంద్ర ఫడ్నవీస్, ఖుష్బూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీకి చెందిన అతిరథ మహారథులను రంగంలోకి దింపుతోంది. జాతీయ కార్యవర్గ భేటీని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న కమలం పార్టీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలను నియోజకవర్గాలకు పంపుతోంది.
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, పురుషోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్ తదితర కేంద్ర మంత్రులు, రమణ్‌సింగ్, దేవేంద్ర ఫడ్నవిస్ తదితర మాజీ సీఎంలు, ప్రకాశ్ జవదేకర్, రవి శంకర్‌ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూఢీ, సినీనటి ఖుష్బూ వంటి నేతలు మూడురోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో మకాం వేయనున్నారు. వీరంతా తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల నేతలు (ప్రవాసీలు) కావడం ఆసక్తి కలిగిస్తోంది.
ప్రజలతోనూ ముఖాముఖి
పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. నేతలంతా అధినాయకత్వం ముందుగానే నిర్దేశించిన మేరకు.. కార్యకర్తల ఇళ్లలోనే భోజనాలు చేస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అధికార టీఆర్‌ఎస్ ప్రభావం, అక్కడున్న సమస్యలు తదితర అంశాలపై ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోర్చాలతో సమావేశమౌతారు. స్థానికంగా ప్రజలను కలుసుకుని ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని, పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తారు.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మద్దతు కోరడంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం గురించి తెలియజేస్తారు. హైదరాబాద్‌లో కార్యవర్గ భేటీ నిర్వహణ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి, 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు రావాలంటూ ఆహ్వానాలు అందజేస్తారు.
అధికార టీఆర్‌ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆయా అంశాలన్నిటిపై జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన మార్పులను కూడా సూచిస్తారు. కాగా ఆయా ప్రాంతాల నుంచే నేతలంతా 2వ తేదీ మధ్యాహ్నం జాతీయ భేటీ వేదికైన నోవాటెల్‌కు చేరుకుంటారు.
అన్ని నియోజక వర్గాలకు..
బీజేపీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బస చేయనున్నారు. ఈ జాబితాలో ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులు, పలువురు మాజీ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు. వచ్చేనెల 1–4 తేదీల మధ్య హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గభేటీ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచే నేతలు రాష్ట్రానికి చేరుకోవడం మొదలుకానుంది. వీరంతా 28 నుంచి జూలై 1 మధ్యలో కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి మూడురోజుల పాటు కార్యకర్తల ఇళ్లల్లోనే బస చేయనున్నారు. ఈ నేతలకు రాష్ట్ర పార్టీకి చెందిన ఆ నియోజకవర్గానికి చెందని నాయకుడు సమన్వయకర్తగా ఉంటూ స్థానికంగా ఏర్పాట్లు చేయడంతో పాటు సమావేశాలకు తగిన సహకారం అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment