National leadership
-
పగ్గాల మార్పుకే మొగ్గు?.. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. అక్కడి తప్పులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పుల దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పలు కమిటీల్లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేర్చినా, తెలంగాణలో పాగా వేయాలంటే అది చాలదని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జరగాల్సిన తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కార్యాచరణపై ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రనేతల సమాలోచనలు..రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల ప్రకటనలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో.. దక్షిణాదిలో సానుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం మొన్నటివరకు భావిస్తూ వచ్చింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడం, పార్టీ స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమనే కచ్చితమైన అంచనాల నేపథ్యంలో తెలంగాణలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉండడంతో ముఖ్యనేతల మధ్య సమన్వయం లోపించింది. మంత్రులు, సీనియర్ నాయకులు ఎవరికివారు అన్నట్టుగా వ్యవహరించారు. దీనితో పాటు 40 శాతం కమీషన్ల సర్కార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడించారనే అంచనాకు జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. అక్కడ పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయామని భావిస్తున్న జాతీయ నేతలు.. తెలంగాణ బీజేపీలోనూ పాత, కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సత్సంబంధాలు ఏర్పడకపోవడం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను రాష్ట్ర నేతలు ఐక్యంగా ఎదుర్కోకపోవడం, పార్టీలో సమన్వయలేమి, పార్టీని, రాష్ట్ర నాయకత్వాన్ని, నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యాఖ్యానాలు చేయడం వంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. అధికార బీఆర్ఎస్తో కొందరు పార్టీ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వారి దృష్టికి వచ్చాయి. మరికొందరు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధినాయకత్వం అప్రమత్తమైందని చెబుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నేతలు మేథోమథనం చేస్తుండడంతో, అతి త్వరలోనే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, కార్యాచరణ ప్రణాళికపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని, ఈ మేరకు తమకు సంకేతాలు అందినట్టుగా ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ కృషి సరిపోదు..! గత మూడేళ్లలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని బలోపేతం చేసి అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చారనే అభిప్రాయంతో పలువురు నేతలున్నారు. అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు సరిపోవని కొందరు నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ఇతర పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు పార్టీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, సంస్థాగతంగా వివిధ స్థాయిల్లో మార్పులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో పార్టీని సమర్ధంగా నడిపించిన సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సముచిత గౌరవాన్ని కల్పిస్తారనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. జాతీయ నాయకత్వం చేపట్టబోయే మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం ఇక్కడ పర్యటిస్తున్న అధిష్టానం దూతలు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సూచాయగా పంచుకున్నట్టు తెలిసింది. కీలక పదవులు అప్పగించే వారితో వారు భేటీ కూడా అయినట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి, బీసీ వర్గానికి చెందిన ముఖ్యనేతకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన పదవిని కట్టబెట్టడం లేదా బీసీ నేతకు అధ్యక్ష పదవి, రెడ్డి సామాజికవర్గ నేతకు ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పలువురు నేతలు అంటున్నారు. -
ఎన్నికల సన్నద్ధత ఎందాకా! బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీపై నేతలు ఏమేరకు సన్నద్ధంగా ఉన్నారన్న దానిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. ఇప్పట్నుంచే ఎన్నికల వ్యూహాల కోసం సమాచార సేకరణలో నిమగ్నమైంది. ఆది, సోమవారాల్లో నాలుగేసి జిల్లాల చొప్పున వేర్వేరుగా నిర్వహించిన జిల్లా కోర్ కమిటీల సమావేశాల్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నావళి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల సమావేశం సందర్భంగా ఏయే నియోజకవర్గాల్లో, ఎవరెవరు పోటీకి సిద్ధపడుతున్నారు? బలమైన నేతలు ఎవరైనా బీజేపీలో చేరుతారా? అనే వివరాలను సేకరించినట్టు తెలిసింది. మంగళవారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కోర్ కమిటీతో భేటీ జరగనుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు డబ్బు సంచులు మునుగోడు సర్వేలన్నీ బీజేపీకే అనుకూలమని, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, కేసీఆర్ సొంత సర్వేలు చెబుతున్నాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్ కమిటీ భేటీలో బండి సంజయ్ పేర్కొన్నారు. గెలుపుపై అపనమ్మకంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలకు ప్రగతిభవన్ నుంచి డబ్బు సంచులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! -
బలం బలగం అంచనాకు కమల దళపతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీకి చెందిన అతిరథ మహారథులను రంగంలోకి దింపుతోంది. జాతీయ కార్యవర్గ భేటీని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న కమలం పార్టీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలను నియోజకవర్గాలకు పంపుతోంది. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, పురుషోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్ తదితర కేంద్ర మంత్రులు, రమణ్‌సింగ్, దేవేంద్ర ఫడ్నవిస్ తదితర మాజీ సీఎంలు, ప్రకాశ్ జవదేకర్, రవి శంకర్‌ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్ రూఢీ, సినీనటి ఖుష్బూ వంటి నేతలు మూడురోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో మకాం వేయనున్నారు. వీరంతా తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల నేతలు (ప్రవాసీలు) కావడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలతోనూ ముఖాముఖి పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. నేతలంతా అధినాయకత్వం ముందుగానే నిర్దేశించిన మేరకు.. కార్యకర్తల ఇళ్లలోనే భోజనాలు చేస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తారు. అధికార టీఆర్ఎస్ ప్రభావం, అక్కడున్న సమస్యలు తదితర అంశాలపై ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోర్చాలతో సమావేశమౌతారు. స్థానికంగా ప్రజలను కలుసుకుని ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని, పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మద్దతు కోరడంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం గురించి తెలియజేస్తారు. హైదరాబాద్‌లో కార్యవర్గ భేటీ నిర్వహణ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి, 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు రావాలంటూ ఆహ్వానాలు అందజేస్తారు. అధికార టీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆయా అంశాలన్నిటిపై జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన మార్పులను కూడా సూచిస్తారు. కాగా ఆయా ప్రాంతాల నుంచే నేతలంతా 2వ తేదీ మధ్యాహ్నం జాతీయ భేటీ వేదికైన నోవాటెల్‌కు చేరుకుంటారు. అన్ని నియోజక వర్గాలకు.. బీజేపీకి చెందిన ముఖ్య నేతలు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో బస చేయనున్నారు. ఈ జాబితాలో ఏడెనిమిది మంది కేంద్ర మంత్రులు, పలువురు మాజీ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు. వచ్చేనెల 1–4 తేదీల మధ్య హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గభేటీ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచే నేతలు రాష్ట్రానికి చేరుకోవడం మొదలుకానుంది. వీరంతా 28 నుంచి జూలై 1 మధ్యలో కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి మూడురోజుల పాటు కార్యకర్తల ఇళ్లల్లోనే బస చేయనున్నారు. ఈ నేతలకు రాష్ట్ర పార్టీకి చెందిన ఆ నియోజకవర్గానికి చెందని నాయకుడు సమన్వయకర్తగా ఉంటూ స్థానికంగా ఏర్పాట్లు చేయడంతో పాటు సమావేశాలకు తగిన సహకారం అందిస్తారు. -
బీజేపీ పరిస్థితిపై అధిష్టానం దృష్టి
నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో జాతీయ నేత పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించింది. సంస్థాగతంగా పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ కిందిస్థాయిలో పార్టీ యంత్రాంగం తీరు, ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర శాఖల పనితీరు ఎలా ఉందన్న దానిపై పరిశీలనలో భాగంగా మూడురోజుల పర్యటనపై జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఇక్కడకు వస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ స్థితి, జిల్లా, మండల, బూత్‌స్థాయిల్లో చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. బుధ, గురువారాల్లో పార్టీ రాష్ర్ట పదాధికారులు, నగరశాఖ కార్యవర్గం, వివిధ జిల్లా కమిటీలతో... శుక్రవారం రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ అవుతారు. జాతీయ పార్టీ దిశానిర్దేశం మేరకు పార్టీ విభాగాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏమి చేయాలనే దానిపై దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ముగిశాక ఆయా అంశాలపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన ఒక నివేదికను సమర్పిస్తారు. -
బీజేపీ ‘మిషన్ 2019’
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నాయకత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం పలు సూచనలు చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్ 2019’కు సిద్ధం కావాలని ఆదే శించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా పోలింగ్‌బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలంది. పార్టీపరంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలంటే పోలింగ్ బూత్‌స్థాయిలో సెప్టెంబర్ 25న పార్టీ సిద్ధాంతవేత్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 23న పార్టీ అగ్రనేత డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదానదినం, సామాజిక న్యాయ సాధనకు కృషిలో భాగంగా అంబేడ్కర్, జగ్జీవన్‌రాం జయంతులను చేపట్టాలని సూచించింది. హైదరాబాద్ స్టేట్‌కు విమోచన లభించిన సెప్టెంబర్ 17న అన్ని పోలింగ్ బూత్‌ల్లో జాతీయజెండాలను ఎగురవేసేలా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రపార్టీకి అనుమతినిచ్చింది. ఆదివారంరాత్రి కేరళలోని కోజికోడ్‌లో ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గసమావేశంలో రాష్ట్రపార్టీ నాయకత్వానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. బడుగులపై ప్రత్యేక దృష్టి... పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, హైదరాబాద్ విమోచనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాం డ్‌పై నెలపాటు నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతంపట్ల ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. రాష్ర్టంలో బడుగు, బలహీనవర్గాల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాలను చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని అధిష్టానం సూచిం చింది. పేదల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించింది. ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ పేదల సంక్షేమం, వారికి ప్రభుత్వ, పార్టీ, వ్యక్తులపరంగా సహాయం అందించడానికి ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ను నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్దేశం చేసింది. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతిని పురస్కరించుకుని పేదలకు మేలు కలిగే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. -
జిల్లా కేంద్రాల్లో బీజేపీకి సొంత భవనాలు
రాష్ట్ర శాఖకు జాతీయ నాయకత్వం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాలు నిర్మించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. భవన నిర్మాణాలకోసం స్థల సేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర శాఖకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. తెలంగాణలోని 10 జిల్లాల్లో పార్టీకి సొంత భవనాలు ఉండాల్సిందేనని, అందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి సూచనలు అందాయి. కాగా, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీకి ఇప్పటికే సొంత భవనాలున్నాయి. మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో సొంత భవనాలు లేవు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్థలసేకరణ పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో స్థల పరిశీలన జరుగుతోంది. కొత్తగా నిర్మించబోయే పార్టీ కార్యాలయాలకు అన్ని జిల్లాల్లో ఒకే రకమైన డిజైన్ ఉండాలని కేంద్ర నాయకత్వం సూచనలు చేసింది. దీనికి అవసరమైన నిధులను కూడా కేంద్ర నాయకత్వమే సమకూర్చనుంది. -
కేంద్రంలో వెలిగి.. రాష్ట్రంలో నలిగి..
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వెలిగిపోతున్నా తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్రంలో బీజేపీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలేమీలేవని ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని ఆశించిన నేతలు గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నిరాశకు గురయ్యారు. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లోనూ అంతకన్నా దారుణమైన ప్రతికూల ఫలితాలను చవిచూసింది. ‘ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. బీజేపీ రాష్ట్రంలో విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక వనరులు, విశ్వాసం కల్పించే నాయకుడు, నాయకుల మధ్య సమన్వయం కొరవడ్డాయి. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీగా బీజేపీకి అన్నివర్గాల్లో సానుకూలత ఉంది. కారణం ఏమిటో తెలియదు కానీ రాష్ట్రంలో పార్టీని గుర్తిస్తున్నట్టుగా కనిపించడం లేదు’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీకి హైదరాబాద్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చేస్తున్న కృషి చెప్పుకోదగిన స్థాయిలో లేదని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్రమంత్రిగా దత్తాత్రేయ ఉన్నా పార్టీ విస్తరణలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐదారుగురు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఆరాటం.. పార్టీ విస్తరణకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయంటున్నారు. జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని పనివిభజన చేస్తే ప్రయోజనం ఉంటుందని సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. -
నాగంకు బీజేపీలో కీలక పదవి?
జాతీయ నాయకత్వం యోచన సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. బీజేపీని వీడకుండానే సొంతంగా బచావో తెలంగాణ మిషన్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగం అనుభవాన్ని రాష్ట్రంలో పార్టీ విస్తరణకు వినియోగించుకోవాలనే యోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షపదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడాలంటే బీజేపీలో కనీస అర్హతలు, అంతర్గత పరిమితులు చాలా ఉన్నాయి. సాధారణ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై నాగం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటికి తోడు పార్టీకి సమాంతరంగా బచావో తెలంగాణ మిషన్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పార్టీ జాతీయ నాయకులతో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరుగతున్న నేపథ్యంలో జనార్ధన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి, పార్టీలో క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ కమిటీలో లేదా రాష్ట్ర కమిటీలోనే ప్రత్యేక పదవిని సృష్టించడం వంటి యోచనతో ఉన్నట్టుగా సమాచారం. -
10 లక్షల మందికి సభ్యత్వం కల్పించండి
బీజేపీ రాష్ట్ర శాఖకు పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశం హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఐదు నెలల్లో పది లక్షల మందికి బీజేపీ సభ్యత్వం కల్పించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖకు లక్ష్యంగా విధించింది. నవంబర్‌లో మొదలయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైందిగా భావించి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించింది. బుధవారం బెంగళూరులో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక జాతీయస్థాయి వర్క్‌షాపులో ఈ లక్ష్యాన్ని పార్టీ రాష్ట్ర శాఖ ముందుంచింది.ప్రస్తుతం కమలం పార్టీకి తెలంగాణలో నాలుగున్నర లక్షల సభ్యత్వం ఉంది. దీన్ని వీలైనంత మేర పెంచుతూ పది లక్షలకు తక్కువ కాకుండా చూడాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు జగత్ ప్రకాశ్ నడ్డా, రాంలాల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సూచించారు. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను కైవసం చేసుకుని వరస విజయాలతో ఊపు మీద ఉన్న బీజేపీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణవైపు దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. వ చ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే రాష్ట్ర శాఖ ముందు భారీ లక్ష్యాలనే ఉంచాలని నిర్ణయించి తొలుత సభ్యత్వ నమోదును ఎంచుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 21 లక్షల మేర ఓట్లను సాధించింది. ఇది వచ్చే ఎన్నికల నాటికి 75 లక్షలను మించాలంటే సభ్యత్వ నమోదు 10 లక్షలకు తగ్గవద్దనేది పార్టీ ఢిల్లీ నేతల విశ్లేషణ. దీన్ని సాధిస్తామని, ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర నేతలు వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.