నాగంకు బీజేపీలో కీలక పదవి?
జాతీయ నాయకత్వం యోచన
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది. బీజేపీని వీడకుండానే సొంతంగా బచావో తెలంగాణ మిషన్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాగం అనుభవాన్ని రాష్ట్రంలో పార్టీ విస్తరణకు వినియోగించుకోవాలనే యోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షపదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడాలంటే బీజేపీలో కనీస అర్హతలు, అంతర్గత పరిమితులు చాలా ఉన్నాయి.
సాధారణ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై నాగం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటికి తోడు పార్టీకి సమాంతరంగా బచావో తెలంగాణ మిషన్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పార్టీ జాతీయ నాయకులతో సత్సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరుగతున్న నేపథ్యంలో జనార్ధన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి, పార్టీలో క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ కమిటీలో లేదా రాష్ట్ర కమిటీలోనే ప్రత్యేక పదవిని సృష్టించడం వంటి యోచనతో ఉన్నట్టుగా సమాచారం.