సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వెలిగిపోతున్నా తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్రంలో బీజేపీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలేమీలేవని ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని ఆశించిన నేతలు గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నిరాశకు గురయ్యారు. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లోనూ అంతకన్నా దారుణమైన ప్రతికూల ఫలితాలను చవిచూసింది. ‘ కేంద్రంలో అధికారంలో ఉన్నాం.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. బీజేపీ రాష్ట్రంలో విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక వనరులు, విశ్వాసం కల్పించే నాయకుడు, నాయకుల మధ్య సమన్వయం కొరవడ్డాయి. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీగా బీజేపీకి అన్నివర్గాల్లో సానుకూలత ఉంది. కారణం ఏమిటో తెలియదు కానీ రాష్ట్రంలో పార్టీని గుర్తిస్తున్నట్టుగా కనిపించడం లేదు’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీకి హైదరాబాద్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చేస్తున్న కృషి చెప్పుకోదగిన స్థాయిలో లేదని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
కేంద్రమంత్రిగా దత్తాత్రేయ ఉన్నా పార్టీ విస్తరణలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐదారుగురు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఆరాటం.. పార్టీ విస్తరణకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయంటున్నారు. జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని పనివిభజన చేస్తే ప్రయోజనం ఉంటుందని సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో వెలిగి.. రాష్ట్రంలో నలిగి..
Published Fri, Mar 4 2016 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement