బీజేపీ ‘మిషన్ 2019’
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నాయకత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర కమిటీకి జాతీయ నాయకత్వం పలు సూచనలు చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్ 2019’కు సిద్ధం కావాలని ఆదే శించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా పోలింగ్‌బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలంది. పార్టీపరంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలంటే పోలింగ్ బూత్‌స్థాయిలో సెప్టెంబర్ 25న పార్టీ సిద్ధాంతవేత్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి, అక్టోబర్ 23న పార్టీ అగ్రనేత డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదానదినం, సామాజిక న్యాయ సాధనకు కృషిలో భాగంగా అంబేడ్కర్, జగ్జీవన్‌రాం జయంతులను చేపట్టాలని సూచించింది.
హైదరాబాద్ స్టేట్‌కు విమోచన లభించిన సెప్టెంబర్ 17న అన్ని పోలింగ్ బూత్‌ల్లో జాతీయజెండాలను ఎగురవేసేలా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రపార్టీకి అనుమతినిచ్చింది. ఆదివారంరాత్రి కేరళలోని కోజికోడ్‌లో ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గసమావేశంలో రాష్ట్రపార్టీ నాయకత్వానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది.
బడుగులపై ప్రత్యేక దృష్టి...
పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, హైదరాబాద్ విమోచనను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాం డ్‌పై నెలపాటు నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతంపట్ల ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు. రాష్ర్టంలో బడుగు, బలహీనవర్గాల జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాలను చేరుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని అధిష్టానం సూచిం చింది. పేదల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించింది.
ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’
పేదల సంక్షేమం, వారికి ప్రభుత్వ, పార్టీ, వ్యక్తులపరంగా సహాయం అందించడానికి ఈ ఏడాదంతా ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ను నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్దేశం చేసింది. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతిని పురస్కరించుకుని పేదలకు మేలు కలిగే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది.