బీజేపీ రాష్ట్ర శాఖకు పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశం
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఐదు నెలల్లో పది లక్షల మందికి బీజేపీ సభ్యత్వం కల్పించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖకు లక్ష్యంగా విధించింది. నవంబర్‌లో మొదలయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైందిగా భావించి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించింది. బుధవారం బెంగళూరులో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక జాతీయస్థాయి వర్క్‌షాపులో ఈ లక్ష్యాన్ని పార్టీ రాష్ట్ర శాఖ ముందుంచింది.ప్రస్తుతం కమలం పార్టీకి తెలంగాణలో నాలుగున్నర లక్షల సభ్యత్వం ఉంది. దీన్ని వీలైనంత మేర పెంచుతూ పది లక్షలకు తక్కువ కాకుండా చూడాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు జగత్ ప్రకాశ్ నడ్డా, రాంలాల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సూచించారు.
ఇటీవల మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను కైవసం చేసుకుని వరస విజయాలతో ఊపు మీద ఉన్న బీజేపీ అధిష్టానం ఇప్పుడు తెలంగాణవైపు దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. వ చ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే రాష్ట్ర శాఖ ముందు భారీ లక్ష్యాలనే ఉంచాలని నిర్ణయించి తొలుత సభ్యత్వ నమోదును ఎంచుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 21 లక్షల మేర ఓట్లను సాధించింది. ఇది వచ్చే ఎన్నికల నాటికి 75 లక్షలను మించాలంటే సభ్యత్వ నమోదు 10 లక్షలకు తగ్గవద్దనేది పార్టీ ఢిల్లీ నేతల విశ్లేషణ. దీన్ని సాధిస్తామని, ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాష్ట్ర నేతలు వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.
10 లక్షల మందికి సభ్యత్వం కల్పించండి
Published Thu, Oct 30 2014 2:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement