సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. అక్కడి తప్పులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పుల దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పలు కమిటీల్లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేర్చినా, తెలంగాణలో పాగా వేయాలంటే అది చాలదని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు చెబుతున్నారు.
సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జరగాల్సిన తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కార్యాచరణపై ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రనేతల సమాలోచనలు..రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల ప్రకటనలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.
కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో..
దక్షిణాదిలో సానుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం మొన్నటివరకు భావిస్తూ వచ్చింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడం, పార్టీ స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమనే కచ్చితమైన అంచనాల నేపథ్యంలో తెలంగాణలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉండడంతో ముఖ్యనేతల మధ్య సమన్వయం లోపించింది. మంత్రులు, సీనియర్ నాయకులు ఎవరికివారు అన్నట్టుగా వ్యవహరించారు. దీనితో పాటు 40 శాతం కమీషన్ల సర్కార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడించారనే అంచనాకు జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. అక్కడ పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయామని భావిస్తున్న జాతీయ నేతలు.. తెలంగాణ బీజేపీలోనూ పాత, కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సత్సంబంధాలు ఏర్పడకపోవడం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను రాష్ట్ర నేతలు ఐక్యంగా ఎదుర్కోకపోవడం, పార్టీలో సమన్వయలేమి, పార్టీని, రాష్ట్ర నాయకత్వాన్ని, నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యాఖ్యానాలు చేయడం వంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది.
అధికార బీఆర్‌ఎస్‌తో కొందరు పార్టీ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వారి దృష్టికి వచ్చాయి. మరికొందరు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధినాయకత్వం అప్రమత్తమైందని చెబుతున్నారు.
గత మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నేతలు మేథోమథనం చేస్తుండడంతో, అతి త్వరలోనే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, కార్యాచరణ ప్రణాళికపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని, ఈ మేరకు తమకు సంకేతాలు అందినట్టుగా ముఖ్యనేతలు చెబుతున్నారు.
ఈ కృషి సరిపోదు..!
గత మూడేళ్లలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని బలోపేతం చేసి అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చారనే అభిప్రాయంతో పలువురు నేతలున్నారు. అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు సరిపోవని కొందరు నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.
దీంతోపాటు ఇతర పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు పార్టీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, సంస్థాగతంగా వివిధ స్థాయిల్లో మార్పులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో పార్టీని సమర్ధంగా నడిపించిన సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సముచిత గౌరవాన్ని కల్పిస్తారనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది.
జాతీయ నాయకత్వం చేపట్టబోయే మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం ఇక్కడ పర్యటిస్తున్న అధిష్టానం దూతలు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సూచాయగా పంచుకున్నట్టు తెలిసింది. కీలక పదవులు అప్పగించే వారితో వారు భేటీ కూడా అయినట్టు సమాచారం.
రాష్ట్రంలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి, బీసీ వర్గానికి చెందిన ముఖ్యనేతకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన పదవిని కట్టబెట్టడం లేదా బీసీ నేతకు అధ్యక్ష పదవి, రెడ్డి సామాజికవర్గ నేతకు ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పలువురు నేతలు అంటున్నారు.
పగ్గాల మార్పుకే మొగ్గు?.. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్..
Published Thu, Jun 8 2023 2:38 AM | Last Updated on Thu, Jun 8 2023 3:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment