మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై
సాక్షి, నస్పూర్: తల్లిపొత్తిళ్లల్లో సేదతీరాల్సిన శిశువు చెట్లపొదల్లో విగతజీవిగా పడి ఉంది.. నవమాసాలు మోసిన కన్నతల్లి, బిడ్డ కళ్లు తెరిచే సమయానికి ఎందుకో మరి కనిపించకుండాపోయింది.. ‘అమ్మా.. నేనేం పాపం చేశాను?’అని అడుగుతున్నట్టుగా అక్కడ ఆడశిశువు మృతదేహం పడి ఉంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి రోడ్‌లో చెట్లపొదల్లో శరీరభాగాలు చిందరవందరగా పడి ఉన్న ఓ గుర్తుతెలియని ఆడశిశువు మృతదేహాన్ని శుక్రవారం స్థానికులలు గమనించారు.
స్థానికుల సమాచారం మేరకు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి, స్థానిక ఎస్సై టి.శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వైద్యులు వచ్చి మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. గుర్తు తెలియనివ్యక్తులు మూడురోజుల క్రితం శిశువును కవర్‌లో చుట్టి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని జంతువులు పీక్కుతినడంతో తల, చేయి లేకుండాపోయాయి. ఈ హృదయవిదారకమైన దృశ్యాన్ని చూసిన పలువురు మహిళలు కంటతడి పెట్టారు.
చదవండి: (ఆక్సిజన్ అందక.. ఊపిరి ఆగింది!)
Comments
Please login to add a commentAdd a comment