కంటోన్మెంట్: బ్రిటీష్ పాలనావశేషాలుగా కొనసాగుతూ..రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్‌లలో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మిలటరీ ఆధిపత్యంలో పాలన సాగే కంటోన్మెంట్‌లలో తొలిసారిగా ప్రజాప్రతినిధులకు తగిన అధికారాలు కల్పించబోతున్నారు. 1924లో రూపొందించిన తొలి కంటోన్మెంట్ చట్టంలో కొద్దిపాటి మార్పులతో 2006లో ది కంటోన్మెంట్స్ యాక్ట్–2006 రూపొందించారు. తాజాగా నాటి చట్టంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటకీ, బోర్డు స్వరూపాన్నే మార్చే తరహాలో కీలక సవరణలు చేపట్టారు. ఇంతకాలం కంటోన్మెంట్ బోర్డుల్లో నామమాత్రంగానే కొనసాగిన ప్రజాప్రతినిధులైన బోర్డు సభ్యులు ఇకపై నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు.
దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్‌లలోనూ పార్టీ గుర్తులపై బోర్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. ఉపాధ్యక్షడిని సైతం ప్రత్యక్ష తరహాలో నేరుగా ప్రజలే ఎన్నుకోనున్నారు. ఏ–1 కేటగిరికి చెందిన సికింద్రాబాద్‌తో సహా, పలు కంటోన్మెంట్‌లలో ఇకపై బోర్డు బోర్డు సభ్యులు సంఖ్య 68 నుంచి 18కి పెరగనుంది. 2020 జూన్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది కంటోన్మెంట్స్ బిల్–2020 ముసాయిదాలో కొన్ని మార్పులతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత కంటోన్మెంట్‌ల పాలన నూతన చట్టం ఆధారంగానే కొనసాగనుంది.
పార్టీ గుర్తులపై ఎన్నికలు
► ప్రస్తుతం కేటగిరి–1 కంటోన్మెంట్‌గా కొనసాగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉంది.
► నూతన చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ పార్టీల గుర్తులపై ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించనున్నారు.
► ఎనిమిది వార్డుల నుంచి ఒక్కో సభ్యుడితో పాటు, అన్ని వార్డుల ప్రజలు ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకునే అవకాశం కల్పించారు.
కీలకం కానున్న ఉపాధ్యక్షుడు
► కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యే వారికి బోర్డులో చెప్పుకోతగ్గ అధికారాలేమీ లేవు.
► కేవలం బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించడం మినహా, బోర్డు సభ్యులకు అధికారికంగా ప్రత్యేక కార్యాలయం కూడా లేదు.
► ఉపాధ్యక్షుడికి సైతం బోర్డు సభ్యులతో పోలిస్తే ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు.
► తాజా చట్టం ప్రకారం పాలనా సౌలభ్యం కోసం ఆర్థిక, విద్య, వైద్యం, సివిల్ ఏరియా వంటి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
► అన్ని కమిటీల్లోనూ ఉపాధ్యక్షుడు కీలకం కానున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కంటోన్మెంట్ పాలనాంశాలన్నింటిలోనూ ఇకపై బోర్డు ఉపాధ్యక్షుడు వెన్నెముకగా మారనున్నారు.
ఓట్లు పునరుద్ధరించే అవకాశం
► ఎన్నికల కమిషన్‌తో సంబంధం లేకుండా కంటోన్మెంట్‌లో ఓటరు జాబితా ప్రత్యేకంగా రూపొందిస్తారు.
► ఇక ఈ త్వరలో జరగాల్సిన బోర్డు ఎన్నికల కోసం ఈ పాటికే ప్రకటించిన వార్డుల రిజర్వేషన్‌లు సైతం మారే అవకాశం ఉంది.
► మొత్తానికి ఈ రెండు నూతన చట్టాలు అమల్లోకి వస్తే కంటోన్మెంట్‌ల పాలనా వ్యవహారాల్లో కీలక మార్పులు రానున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment