సెల్లార్ల తవ్వకాలు.. తెల్లారుతున్న బతుకులు | Cellar collapse: GHMC to act against owners builder over lack of safety measures on site | Sakshi
Sakshi News home page

సెల్లార్ల తవ్వకాలు.. తెల్లారుతున్న బతుకులు

Published Thu, Feb 6 2025 9:10 AM | Last Updated on Thu, Feb 6 2025 9:11 AM

Cellar collapse: GHMC to act against owners builder over lack of safety measures on site

నిబంధనలు పాటించని బిల్డర్లు 

పట్టించుకోని అధికారులు 

మొక్కుబడిగా నోటీసులు  

నగరంలో ఆగని ఉల్లంఘనలు 

ఎల్‌బీనగర్‌లో మరో దుర్ఘటన   

సాక్షి, హైదరాబాద్‌ : భవన నిర్మాణాల్లో బిల్డర్ల ఉల్లంఘనలు, అధికారుల ఆమ్యామ్యాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నిర్మాణాల్లో పలు డీవియేషన్లకు పాల్పడే బిల్డర్లు సెల్లార్ల తవ్వకాల్లోనూ కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో..  పొట్టకూటి కోసం పనిచేసే కార్మికులు అసువులు బాస్తున్నారు. తాజాగా బుధవారం ఎల్‌బీనగర్‌ పరిధిలో ముగ్గురి ప్రాణాలు పోవడం వెనుకా నిలువెత్తు  నిర్లక్ష్యమే బట్టబయలైంది. సంబంధిత అధికారులు సైతం మొక్కుబడిగా నోటీసులిస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప పనులు ప్రారంభమైనప్పటి నుంచీ తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం లేదు. బిల్డర్లు, అధికారులకు మధ్యనున్న ‘ఆర్థిక సంబంధాలే’ ఇందుకు కారణమనే ఆరోపణలు షరా‘మామూలు’గా మారాయి.  

నిబంధనలు కాగితాల్లోనే.. 
⇒ అనుమతులతోపాటు పాటించాల్సిన నిబంధనలు కాగితాల్లో ఉంటున్నాయి తప్ప చాలామంది వాటిని పాటించడం లేదు. నిబంధనల మేరకు సెల్లార్‌ తవ్వే నేల బలంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలి. పనులు జరిగే ప్రాంతంలో బారికేడింగ్, రిటైనింగ్‌ వాల్‌ ఉండాలి. ప్రస్తుతం పనులు తొలి దశలోనే ఉన్నందున రిటైనింగ్‌ వాల్‌ దాకా రాలేదు కానీ మిగతా జాగ్రత్తలు కూడా పాటించలేదు.  

⇒ నేల జారిపోకుండా అవసరమైన పటిష్టతా చర్యలు చేపట్టాల్సి ఉండగా అవీ జరగడంలేదు. తగిన సెట్‌బ్యాక్‌లు లేవు. సెల్లార్‌ తవ్వకం ప్రాంతాన్ని నిత్యం పరిశీలిస్తూ, ఎక్కడైనా నేల బలహీనంగా ఉన్నా, జారిపోయేలా ఉన్నా  వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. కానీ వాటిని పట్టించుకోలేదు. నిర్మాణంలో భద్రతా చర్యలు, కారి్మకుల రక్షణ చర్యలు గాలికొదిలేశారు.  

⇒ జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు సెల్లార్‌ తవ్వకానికి ముందు నిర్మాణదారు  సంబంధిత అధికారికి సమాచారమివ్వాల్సి ఉండగా, ఆ పని చేయలేదు.  సంబంధిత సర్కిల్‌ అధికారి గతనెల 16వ తేదీన ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి నోటీసు ఇచి్చనట్లు ఎల్‌బీనగర్‌ జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నతాధికారి తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సెల్లార్‌ తవ్వకం పనులు మొదలు పెట్టారు. అందువల్లే వదులుగా ఉన్న మట్టి  మీదపడి ముగ్గురి ప్రాణాలు పోవడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

మృత్యు ఘంటికలు ఇలా.. 
చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే సెల్లార్లు తవ్వుతున్నారు. గత సంవత్సరం అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. ఎల్‌బీనగర్‌జోన్‌లో ఇవి ఎక్కువగా ఉండటం కూడా వెల్లడైంది. తవ్వకాల్లో వెలువడిన మట్టిని తరలించే లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటాన్ని గుర్తించారు.   

⇒ సెల్లార్‌ తవ్వకాల్లో ఉల్లంఘనల  వల్లే దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నానక్‌రామ్‌గూడలో భవనం కూలి పదిమందికి  పైగా మరణించారు.   
⇒  2017లో కొండాపూర్‌లో ఓభవన నిర్మాణానికి సంబంధించి 30 అడుగుల లోతున జరుగుతున్న సెల్లార్‌ పనుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు.  
⇒ 2019లో ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న సెల్లార్‌లో పడి ఇద్దరు మైనర్‌ బాలలు  మరణించారు.  
⇒ 2020లో మాదాపూర్‌ ఖానామెట్‌లో ప్రై వేట్‌ కళాశాల బస్సు సెల్లార్‌ గుంతలో పడింది.కూకట్‌పల్లిలో ఏడాదిక్రితం  నిబంధనలు పాటించనందున సెల్లార్‌ తవ్వుతున్న  పరిసరాల్లో నేల కుంగింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement