వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
మార్చి నుంచి రెగ్యులర్ రైళ్ల సేవలు
కొన్ని రైళ్లకు హాల్టింగ్ సదుపాయం
30 ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం
ఔటర్‌కు సమీపంలో ఉండటంతో ఎక్కడి నుంచైనా రాకపోకలకు వీలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: భాగ్యనగరం సిగలో ముస్తాబైన మరో మణిహారం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో, పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారని ప్రధాని కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి సంజయ్, మంత్రి శ్రీధర్‌బాబు, దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొననున్నారు.
వాస్తవానికి గతేడాది డిసెంబర్ 28నే టెర్మినల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రారంపొత్సవం వాయిదా పడింది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక సికింద్రాబా ద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల ప్రయాణికులు నగరంలో ఎక్కడి నుంచైనా సులువుగా ఈ స్టేషన్‌కు చేరుకొనే వీలుంది.
ఆధునిక హంగులు.. సదుపాయాలు..
ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చర్లపల్లి రెండవ ప్రవేశద్వారం, నూతన రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. స్టేషన్‌లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జితోపాటు 6 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం ఆధునిక కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్‌బే తోపాటు కార్లు, బైక్‌లను నిలిపేందుకు విశాల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
మూడు రైళ్లకు హాల్టింగ్ సదుపాయం
⇒ చర్లపల్లి టెర్మినల్‌లో మంగళవారం నుంచి మూడు రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించనున్నారు.
⇒ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు వెళ్లే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757/12758) మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 8:32 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. నిమిషంపాటు ఆగాక సికింద్రాబాద్ బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7:02 గంటలకు చర్లపల్లికి చేరుకొని నిమిషం హాల్టింగ్ తరువాత సిర్పూర్ కాగజ్‌నగర్ బయలుదేరుతుంది.
⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/1702) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12:41కు.. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:50 గంటలకు నిమిషంపాటు చర్లపల్లిలో ఆగనుంది.
⇒ సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/17234) మధ్యాహ్నం 3:47 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 9:20 గంటలకు నిమిషంపాటు ఆగుతుంది.
త్వరలో ఎంఎంటీఎస్ సర్విసులు...
సికింద్రాబాద్–చర్లపల్లి, బొల్లారం–చర్లపల్లి, ఫలక్‌నుమా–చర్లపల్లి, లింగంపల్లి–చర్లపల్లి, మేడ్చల్–చర్లపల్లి స్టేషన్‌ల మధ్య త్వరలో ఎంఎంటీఎస్ సర్విసులు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్ల రాకపోకలు, సమయపాలనపై కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాయగడ డివిజన్‌కు శంకుస్థాపన కూడా..
ఈస్ట్ కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పరిసర ప్రాంతాల్లో రైల్వే అనుసంధానం మెరుగుపడటంతోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. మరోవైపు 742.1 కి.మీ. మేర కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజన్‌ను మోదీ ప్రారంభించనున్నట్లు తెలిపింది.
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచే..
సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి ఈ నెల 17 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 9 నుంచి 13 మధ్య ఎక్కువ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో సుమారు 30 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి–తిరుపతి (07077/ 07078), చర్లపల్లి–తిరుపతి (02764/02763), చర్లపల్లి–నర్సాపూర్ (07035/ 07036), చర్లపల్లి–నర్సాపూర్ (07033/07034), చర్లపల్లి–కాకినాడ (07031/ 07032), చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు (07041/07042) తదితర రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. అలాగే కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్–కాకినాడ, కాచిగూడ–శ్రీకాకుళం రోడ్డు, నాందేడ్–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
మార్చి నుంచి రెగ్యులర్ రైళ్లు
⇒మార్చి నుంచి రెగ్యులర్ రైళ్ల సేవలు ప్రారంభమవుతాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం నాంపల్లి నుంచి చెన్నైకి రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మార్చి 7 నుంచి చెన్నై సెంట్రల్–చర్లపల్లి (12603/12604)గా సేవలు అందించనుంది. తిరుగు ప్రయాణంలో 8వ తేదీ నుంచి సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరి మర్నాటి ఉదయం 5:40 గంటలకు చెన్నైకి చేరుకుంటుంది.
⇒ ప్రస్తుతం గోరఖ్‌పూర్–సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మార్చి 12 నుంచి గోరఖ్‌పూర్–చర్లపల్లి మధ్య రాకపోకలు సాగించనుంది. ఈమేరకు గోరఖ్‌పూర్–చర్లపల్లి (12589/12590) 12న ఉదయం 6:35 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 13న రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మర్నాటి ఉదయం 6:40 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకోనుంది.
సిటీ బస్సులు ఇలా..
⇒ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి (250సీ) బస్సు ప్రతి 10 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంది.
⇒ బోరబండ నుంచి చర్లపల్లికి (113 రూట్) సిటీ బస్సు సదుపాయం ఉంది.
⇒ ఉప్పల్ నుంచి చెంగిచెర్ల మీదుగా చర్లపల్లికి రెండు రోజుల్లో సర్విసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
⇒ రైళ్ల రాకపోకలకు అనుగుణమైన వేళల్లో మరిన్ని బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment