కొండలు ఎక్కడం, పెద్ద పెద్ద బండరాళ్లపై సేదదీరడం, క్యాంప్ ఫైర్, నైట్ ట్రెకింగ్‌తో అడవిలో తిరిగిన అనుభూతి కలగాలంటే నేచర్ క్యాంప్‌కు వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో ఓ రోజంతా సేదదీరి పరవసించిపోవచ్చు. ఇది ఎక్కడో దూరప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం కాదు. నగరానికి ఆనుకొని ఉన్న చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఉండటంతో నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి బస నుంచి మరుసటి రోజు పార్క్ నుంచి బయటకు వచ్చే వరకూ ఎన్నో మరపురాని అనుభూతులను వెంటతీసుకెళ్లవచ్చు. రచ్చబండలో ముచ్చట్లు, ఫన్నీ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, బర్డ్స్ వాచింగ్ వంటివి ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తాయనడంలో సందేహం లేదు.
– గచ్చిబౌలి
చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసిన నేచర్ క్యాంపులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గుట్టలపై వివిధ ఆకారాల్లో సహజ సిద్ధమైన రాక్ ఫార్మేషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీపం, బేబీ ఏనుగు, ఓల్డ్ మ్యాన్, తాబేలు, పిట్ట పక్కకు చూస్తున్నట్లు ఏర్పాడిన రాళ్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా ఈ రాళ్లపై జంతువుల పెయింటింగ్స్ ఔరా అనిపిస్తాయి. అడవి రారాజు సింహం, కుందేలు, ఏనుగు, ఖడ్గ మృగం, ఉడత, ఎలుగుబంటి బొమ్మలు సందర్శకుల మదిని
దోచేస్తున్నాయి.
బర్డ్స్ వాచ్‌టూర్..
మెయిన్ ట్రెక్ రోడ్డు నుంచి వెళుతూ సందర్శకులు బర్డ్స్ వాచ్ చేస్తారు. 45 రకాల పక్షులు అక్కడ ఉంటాయి. కనీసం 20 రకాలు సందర్శకులకు కనిపిస్తాయి. అరుదైన పక్షుల
గురించి గైడ్ వివరిస్తారు.
ట్రెకింగ్ రోడ్లు..
సముద్ర మట్టానికంటే ఎత్తులో నాలుగు ట్రెక్ రోడ్లు మూడున్నర కిలో మీటర్లు ఉన్నాయి. ట్రెక్ రోడ్డు–1 సముద్ర మట్టానికి 458 మీటర్లు, ట్రెక్ రోడ్డు–2 మట్టానికి 596 మీటర్లు, ట్రెక్ రోడ్డు–3 సముద్ర మట్టానికి 802 మీటర్లు, ట్రెక్ రోడ్డు–4 సముద్ర మట్టానికి 231 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుట్టలపై నడుస్తూ అక్కడక్కడ సేద దీరేందుకు పెద్ద పెద్ద బండరాళ్లు ఉంటాయి. కొద్ది సేపు ఫొటోలు దిగడం, పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకుంటూ గడపవచ్చు.
వీకెండ్ క్యాంప్ ఇలా..
వీకెండ్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు నేచర్ క్యాంప్‌కు చేరుకోవాలి. 4 గంటలకు సందర్శకులంతా మర్రి చెట్టు ర్చబండ వద్దకు చేరతారు. నేచర్‌క్యాంప్ యాక్టివిటీ, టైమింగ్, పార్క్ మ్యాప్‌పై బ్రీఫింగ్ చేస్తారు. విజిటర్స్‌ను రెండు గ్రూపులుగా విభజిస్తారు. స్నాక్స్ అందజేస్తారు.
ఫన్నీ గేమ్స్..
రెండు గ్రూపులు ఫన్నీ గేమ్స్‌తో పోటీ పడతాయి. నెంబర్ స్టాంపింగ్, రోలర్ కోస్టర్, మార్బుల్ గేమ్, ట్రాన్స్‌పోర్ట్ వాటర్, మిషన్ ఇంపాజిబుల్, డ్రామాటిక్స్, పేపర్ కప్, ట్రాన్స్‌పోర్ట్ తదితర గేమ్స్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి
బస చేసేందుకు కపుల్ టెంట్, స్లీపింగ్ బెడ్స్, లాంతర్ వంటివి అందిస్తారు. టెంట్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తారు. టెంట్‌లో స్వచ్ఛమైన ప్రకృతి గాలిని ఆస్వాదించాల్సిందే. రాత్రిళ్లు వాష్‌రూమ్స్‌కు వెళ్లాలంటే గార్డ్స్ సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది. ఒంటరిగా ఎవరినీ
బయటకు వెళ్లవద్దని సూచిస్తారు. రాత్రి 8.30 గంటలకు వెజ్ తాలి(భోజనం) అందజేస్తారు.
టికెట్ వివరాలు...
నేచర్ క్యాంప్‌కు వెళ్లేవారు పెద్దలకు రూ.1800, 12 సంవత్సరాల పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం 94935 49399, 93463 64583 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
నైట్ ట్రెకింగ్..
సందర్శకులంతా కలిసి గైడ్ సమక్షంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నైట్ ట్రెకింగ్ నిర్వహిస్తారు. లాంతర్లు పట్టుకొని దీపం రాక్ మీదుగా వెళతారు. రాత్రి సమయంలో ప్రకృతి ఒడిలో నడవడం, అడవి ఎలా ఉంటుందో చూడటం మరపురాని అనుభూతి. గంట తరువాత తిరిగొస్తారు. బస చోట క్యాంప్ ఫైర్ ఉంటుంది. అంత్యాక్షరి, రోల్ ప్లే, మ్యూజికల్ చైర్స్‌తో సరదాగా గడుపుతారు. ఆదివారం ఉదయం 5.45కు మళ్లీ ట్రెక్ రూట్–4లో పెద్ద చెరువు వరకూ ట్రెకింగ్‌కు వెళ్లి ఉదయం 7.30 గంటలకు తిరిగొస్తారు. మర్రిచెట్టు రచ్చబండకు చేరుకుంటారు. టిఫిన్ చేసిన తరువాత అడ్వెంచర్ గేమ్స్ అడతారు. వ్యాలీ క్రాసింగ్, బర్మా బ్రిడ్జి, వైన్ ట్రావెల్స్ తదితర ఆటలతో సేదదీరుతారు. ఉదయం 10 గంటలకు క్యాంప్ ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment