ఆ వెంటనే బలవన్మరణానికి పాల్పడిన ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి
అనారోగ్య సమస్యలు కారణమంటున్న కుటుంబసభ్యులు
సత్యంది ప్రేమవివాహం.. దంపతులకు ఇద్దరు పిల్లలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ /అల్వాల్ /గాం«దీఆస్పత్రి/మేడ్చల్: రూపాదేవి(40) తన భర్త ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు ఉండగానే రూపాదేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రూపాదేవి తల్లి భూలక్ష్మమ్మ డోర్ తీయడానికి ప్రయత్నించినా రాలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తీయగా, అప్పటికే రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లి భూలక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
చనిపోవడానికి ముందు తన కూతురు భర్తతో మాట్లాడిందని భూలక్ష్మమ్మ చెప్పింది. విషయంగా తెలియగానే నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే సత్యం హుటాహుటిన తనే కారు నడుపుకుంటూ సిటీకి బయలుదేరారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యంను మార్యమధ్యలో ఆపి, ఆస్పత్రికి తన కారులో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు.
దీంతో ఆయనకు ఆదే ఆస్పత్రిలో చికిత్స అందించారు. రూపాదేవి అంత్యక్రియలు శుక్రవారం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గధామంలో జరిగాయి. గురువారం రాత్రి నుంచి రూపాదేవి అంత్యక్రియలు అయ్యే వరకు పొన్నం ప్రభాకర్ సత్యం వెంటే ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సుద్దాల దేవయ్య తదితరులు మేడిపల్లి సత్యంను పరామర్శించారు.
పీజీ చదువుతుండగా ప్రేమలో...
రంగారెడ్డి జిల్లాకు చెందిన రూపాదేవి, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన మేడిపల్లి సత్యంలది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న సత్యం దంపతుల కాపురం అన్యోన్యంగా సాగింది. వీరికి కుమారుడు యోజిత్ (11), కుమార్తె రిషిక (9)లు ఉన్నారు. వృత్తిరీత్యా రూపాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వికారాబాద్ నుంచి మేడ్చల్ మండలంలోని రావల్‌కోల్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. రెండు నెలల క్రితం అల్వాల్ పంచశీల కాలనీకి నివాసం మార్చారు.
గురువారమే బయల్దేరిన సత్యం..
చొప్పదండిలో ఎమ్మెల్యేగా గెలవాలని చాలాకాలంగా ప్రయతి్నంచిన సత్యం 2014, 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2023లో ఎట్టకేలకు విజయం సాధించారు. సత్యం కరీంనగర్‌లోని వీపార్క్ సమీపంలో నివాసముంటున్నారు. భార్య టీచర్ కావడంతో పిల్లలతో కలిసి అల్వాల్‌లోనే నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే అల్వాల్ నుంచి సత్యం చొప్పదండి చేరుకున్నారు. రోజంతా నియోజకవర్గ పరిధిలోని మల్యాల మండలంలో షాదీముబారక్ చెక్కుల పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఒకటి రెండుసార్లు మినహా..
సత్యం ఎమ్మెల్యే అయ్యాక రూపాదేవి నియోజకవర్గంలో చాలా తక్కువగా కనిపించేవారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన సమయంలో, కొండగట్టు సమీపంలోని నల్లగొండ ఆలయంలో మొక్కులు అప్పజెప్పిన సమయంలో సత్యం సతీసమేతంగా కనిపించారు. ఫిబ్రవరి 23న కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు నరేశ్ దంపతుల నాలుగు నెలల చిన్నారికి గుండె చికిత్సకు రూ.లక్ష అందజేసిన సమయంలో రూపాదేవి సత్యంతో కలిసి వచ్చారు. ఇటీవల సత్యం దంపతులు, కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రూపాదేవి సోదరుడు తోట అనిల్ కూడా ఎమ్మెల్యే సత్యం వద్దనే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ఆమె అనారోగ్యమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
రావల్‌కోల్‌లో విషాదఛాయలు
మేడ్చల్ మండలం రావల్‌కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూపాదేవి రెండేళ్లుగా సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మరణవార్తతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్కూల్‌లో ఏనాడు రూపాదేవి వ్యక్తిగత విషయాలు మాట్లాడేవారు కాదని, పేద పిల్లలు బాగా చదవాలని ఆరాటపడేవారని, తోటి ఉపాధ్యాయులు చెప్పారు. రావల్‌కోల్‌కు చెందిన ఓ విద్యారి్థని చదువుకు కూడా ఆమె ఆర్థికసాయం చేశారు. మూడురోజుల క్రితమే సెలవు పెట్టారని, అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారుతున్నానని తనతో చెప్పారని హెచ్‌ఎం తెలిపారు.
గాంధీలో పోస్టుమార్టం
రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించింది. చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్ భద్రత ఏర్పాట్లు పర్య వేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు గాం«దీమార్చురీకి చేరుకుని రూపాదేవి మృతదేహం వద్ద నివాళులరి్పంచి మేడిపల్లి సత్యం, కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment