సాక్షి, హైదరాబాద్: నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. శనివారం సాయంత్రం నగరంలోని ప్రజాభవన్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు.
కాగా, ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎం నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థికశాఖ కార్యదర్శి పియూష్ కుమార్‌లు భేటీలో పాల్గొననున్నారు. ఇక, వీరి భేటీ సందర్భంగా విభజన చట్టంలోకి షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చ జరుగనుంది. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.
మరోవైపు.. ఏపీకి రావాల్సిన రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలపై కూడా ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి సంస్థలపై షీలా భిడే కమిషన్ సిఫార్సుల అమలుపై చర్చ జరుగనుంది. 91 సంస్థల్లో 89 సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల పంపకంపై కమిషన్ సిఫార్సులపై చర్చించనున్నారు. అయితే, వీటిలో 68 సంస్థలకు సంబంధించి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉద్యోగుల విభజన అంశాలు, లేబర్ సెస్ పంపకాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అమ్మో.. ఏపీకా?
Comments
Please login to add a commentAdd a comment